ప్రాజెక్ట్ కె: ఈ సారి విలన్లను పరిచయం చేసిన నాగ్ అశ్విన్
ప్రభాస్ హీరోగా వస్తున్న ప్రాజెక్ట్ కె సినిమాపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సైన్ ఫిక్షన్ సినిమా కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. ఇదివరకు ఈ సినిమా నుండి స్క్రాచ్ అంటూ ఒక టైర్ కోసం చిత్రబృందం మొత్తం ఎంత కష్టపడ్డారో చూపించారు. ఇప్పుడు మరోసారి స్క్రాచ్ రెండవ ఎపిసోడ్ తో వచ్చారు. ఈ సారి స్క్రాచ్ 2 ఎపిసోడ్ లో కాస్ట్యూమ్ డిజైనర్ అర్చనా రావును పరిచయం చేసారు. ఈ వీడియో మొత్తంలో విలన్లకు కాస్ట్యూమ్స్ తయారు చేయడాన్ని చూపించారు. ఇందులో విలన్లు చాలా వింతగా కనిపించారు. ఒకచోట విలన్లను చూపించినట్టే చూపించి చూపించకుండా చేసారు.
కొత్త అనుభవాన్నిచే దిశగా ప్రాజెక్ట్ కె
స్క్రాచ్ సిరీస్ నుండి వచ్చిన రెండవ ఎపిసోడ్ లో ఆసక్తికరమైన అంశాలు చాలానే ఉన్నాయి. ఇందులో కనిపించిన కొన్ని విజువల్, ప్రాజెక్ట్ కె కథ భూమి మీద జరుగుతుందా లేదా మరో గ్రహంలో జరుగుతుందా అన్న అనుమానాలను కలిగించాయి. ప్రాజెక్ట్ కె సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులకు సరికొత్త అనుభవాన్ని ఇవ్వబోతుందనే విషయం స్క్రాచ్ సిరీస్ లలోని వీడియోల ద్వారా అర్థమవుతోంది. దీపికా పదుకునే హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో కనిపిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ చిత్రం, 500కోట్లకు పైగా బడ్జెట్ గా తెరకెక్కుతోంది. 2024 సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ప్రాజెక్ట్ కె చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు.