Aamir Khan: ఆమిర్ పెళ్లి వేళ కుటుంబ విభేదాలకు ముగింపు పలికిన సోదరుడు ఫైసల్
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్ ప్రముఖ నటుడు అమీర్ ఖాన్ త్వరలో తన స్నేహితురాలు గౌరీ స్ప్రాట్‌ను వివాహం చేసుకోనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నో సంవత్సరాలుగా కుటుంబంలో కొనసాగుతున్న విభేదాలకు ఆయన సోదరుడు ఫైసల్ ఖాన్ ముగింపు పలికే ప్రయత్నం చేశారు. గతంలో కుటుంబ సభ్యులపై చేసిన విమర్శలు, వివాదాస్పద వ్యాఖ్యలపై ఆయన పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ, ఇకపై కుటుంబ సంబంధాలను మరింత బలోపేతం చేయడమే తన ప్రధాన లక్ష్యమని వెల్లడించారు.
వివరాలు
ఆమెకు హృదయపూర్వకంగా క్షమాపణలు..
ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఫైసల్ మాట్లాడుతూ, "అందరికంటే ముందుగా మా అమ్మకు హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాను. అలాగే మా కుటుంబ సభ్యులందరికీ, ముఖ్యంగా నా సోదరుడు ఆమిర్‌కు కూడా సారీ చెబుతున్నాను. కోపం, బాధ కారణంగా గతంలో వారిపై అనుచిత వ్యాఖ్యలు చేశాను. ఈ వివాదంలో ఎవరు సరైనవారు, ఎవరు తప్పు చేశారనే విషయాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఇప్పుడు లేదు. ప్రస్తుతం నా దృష్టి అంతా కుటుంబ బంధాలను తిరిగి పటిష్టం చేసుకోవడంపైనే ఉంది" అని పేర్కొన్నారు.
వివరాలు
కుటుంబ సభ్యులపై సంచలన ఆరోపణలు..
తన ఆలోచనా విధానంలో వచ్చిన మార్పుకు ఆధ్యాత్మికత ప్రధాన కారణమని ఫైసల్ తెలిపారు. ఆధ్యాత్మిక భావజాలం వల్ల కుటుంబ సంబంధాల విలువను మరింత లోతుగా అర్థం చేసుకున్నానని, అందుకే పాత విభేదాలను పక్కనబెట్టి అందరితో సఖ్యతగా ఉండాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. గత ఏడాది ఫైసల్ ఖాన్ తన కుటుంబ సభ్యులపై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆమిర్ ఖాన్ తనను ఏడాది పాటు ఒక గదిలో నిర్బంధించారని, తాను మానసిక వ్యాధితో బాధపడుతున్నానని ఇతరులను నమ్మించే ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు.