LOADING...
Tollywood : ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత ఇంస్ట్రీకి పెద్ద దిక్కు ఆయనే..ఆ చెడు అలవాటుతో జీవితం నాశనం!
ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత ఇంస్ట్రీకి పెద్ద దిక్కు ఆయనే..ఆ చెడు అలవాటుతో జీవితం నాశనం!

Tollywood : ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత ఇంస్ట్రీకి పెద్ద దిక్కు ఆయనే..ఆ చెడు అలవాటుతో జీవితం నాశనం!

వ్రాసిన వారు Moogati Shabari
Apr 14, 2026
02:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలుగు సినీ రంగంలో నటరత్న ఎన్టీఆర్ తరువాత అంతటి వ్యక్తిత్వం, ఆకర్షణ కలిగిన నటుడు ఎవరు అంటే అప్పటి ప్రేక్షకులందరూ హరనాథ్ పేరునే ప్రస్తావించేవారు. సాంఘిక సినిమాలకే పరిమితం కాకుండా పౌరాణిక, చారిత్రక, జానపద కథాంశాలున్న సినిమాల్లోనూ తన ప్రతిభను చూపిస్తూ, ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తర్వాతి స్థానానికి తానే అర్హుడినని నిరూపించారు. అయితే జీవితం ఎత్తులకు చేరినప్పుడు కూడా వినయాన్ని కోల్పోకపోతేనే సాఫీగా సాగుతుంది. కానీ ఎదుగుదల సమయంలో వృత్తిని నిర్లక్ష్యం చేసి వ్యసనాలకు లోనైతే జీవితం ఎలా దెబ్బతింటుందో హరనాథ్ గారి జీవితం స్పష్టంగా చూపిస్తుంది. హీరోగా మంచి గుర్తింపు పొందుతూ బిజీగా ఉన్న సమయంలోనే అలవాట్ల బారిన పడి, తన కెరీర్‌ను స్వయంగా నాశనం చేసుకున్నారు.

వివరాలు

సినీ కెరీర్ ప్రారంభమయ్యిందిలా..

ఆయన అసలు పేరు బుద్ధరాజు వెంకట అప్పల హరినాథరాజు. తండ్రి వరహాల రాజు కూడా నటుడే. అక్కినేని నటించిన "మాయాలోకం" చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. హరనాథ్ నటించిన తొలి చిత్రం "మాయింటి మహాలక్ష్మి" కాగా, కెమెరా ముందుకొచ్చిన సినిమా "ఋష్యశృంగ". తరువాత "భక్త శబరి", "మనోరమ", "సహస్ర శిరఛ్ఛేద అపూర్వ చింతామణి" వంటి చిత్రాల్లో నటించారు. అదే కాలంలో ఎన్టీఆర్ "సీతారామకళ్యాణం" చిత్ర నిర్మాణాన్ని ప్రారంభించారు. రాముడి పాత్రకు యువ నటుడిని ఎంపిక చేయాలనుకున్న ఆయన, ఒకసారి పాండీబజార్‌లో హరనాథ్‌ను చూసి ఆ పాత్రను ఆఫర్ చేశారు. మేకప్ పరీక్షలో విఫలమైతే భవిష్యత్తుపై ప్రభావం ఉంటుందేమోనని హరనాథ్ సందేహపడినా, తనపై నమ్మకం ఉందని తెలిపారు.

వివరాలు

కృష్ణుడి పాత్రలో కనిపించిన హీరో..

ఎన్టీఆర్ స్వయంగా ఆయన నుదుట తిలకం పెట్టి పరీక్షకు సిద్ధం చేయగా, చివరికి రాముడి పాత్రకు ఎంపికయ్యారు. ఆ చిత్రంలో లక్ష్మణుడిగా శోభన్ బాబు, భరతుడిగా కొమ్మినేని శేషగిరిరావు నటించారు. పౌరాణిక పాత్రలు పోషించే సమయంలో ఎన్టీఆర్ ఎంతో నియమంతో ఉండేవారు. అయితే హరనాథ్ మాత్రం రాముడి వేషంలో ఉన్నప్పటికీ సిగరెట్ తాగే అలవాటు విడిచిపెట్టలేదు. ఇది తెలుసుకుని ఎన్టీఆర్ బాధపడి మందలించినా, ఆయన ఆ అలవాటును వదిలేయలేకపోయారు. అయినప్పటికీ "సీతారామకళ్యాణం"లో ఆయన నటనకు మంచి ప్రశంసలు లభించాయి. దీంతో ఎన్టీఆర్ తన స్నేహితుడు బి.ఏ. సుబ్బారావు తీసిన "భీష్మ" చిత్రంలో కృష్ణుడి పాత్రను కూడా ఆయనకు కల్పించారు. ఆ సినిమాలో ఆయన రూపం ప్రత్యేకంగా మెప్పించింది.

Advertisement

వివరాలు

ప్రేక్షకుల్లో ఆదరణ..

హరనాథ్ అలవాట్లు తెలిసినా, మంచి నటుడిగా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఎన్టీఆర్ ఆయనకు మరికొన్ని అవకాశాలు కల్పించారు. ఎన్టీఆర్‌తో కలిసి నటించిన "పాండవ వనవాసం", "పల్నాటి యుద్ధం", "పుణ్యవతి", "గుండమ్మ కథ", "చిట్టి చెల్లెలు", "నాదీ ఆడజన్మే", "కలిసి ఉంటే కలదు సుఖం" వంటి చిత్రాలు విజయవంతమయ్యాయి. నటనలో ఎన్టీఆర్ నుంచి ఎంతో నేర్చుకున్నప్పటికీ, ఆయన క్రమశిక్షణను మాత్రం హరనాథ్ అనుసరించలేకపోయారు. 1961 నుంచి 1972 వరకు ఆయన కెరీర్ స్వర్ణయుగంగా చెప్పుకోవచ్చు. జమునతో జరిగిన విభేదాల కారణంగా ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఆమెతో నటించని సమయంలో, హరనాథ్-జమున జంటకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఆ సమయంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తర్వాతి స్థానానికి హరనాథ్ పేరే వినిపించింది.

Advertisement

వివరాలు

ఎస్వీ రంగారావుతో స్నేహం..

అయితే ఇదే సమయంలో ఆయన మద్యం వంటి వ్యసనాలకు బానిసయ్యారు. పలువురు హెచ్చరించినా వినకుండా మత్తులో మునిగిపోయారు. ఎస్వీ రంగారావుతో ఆయనకు మంచి స్నేహం ఉండేది. ఇద్దరూ గొప్ప నటులైనా, నటనలో పోటీ పడాల్సింది పోయి వ్యసనాలలో పోటీ పడటం వారి కెరీర్‌పై ప్రభావం చూపింది. హరనాథ్‌కు పాత్ర ఇస్తే షూటింగ్‌కు సమయానికి వస్తారో లేదో తెలియని పరిస్థితి ఏర్పడింది. వచ్చినా ఏ పరిస్థితిలో ఉంటారో అనిశ్చితి ఉండేది. దీంతో ఆయనకు వచ్చిన అవకాశాలు తగ్గుతూ, ఒక్కొక్కటిగా చేతుల నుంచి జారిపోయాయి. ఆ సమయంలో వచ్చిన కృష్ణ, శోభన్ బాబు వంటి యువ హీరోలు ఆ అవకాశాలను అందిపుచ్చుకున్నారు.

వివరాలు

వ్యసనాలతో వెనుకబాటు..

ముందుచూపు లేకుండా పూర్తిగా వ్యసనాలకే లోనైన హరనాథ్ క్రమంగా వెనుకబడ్డారు. ఒకప్పుడు మంచి సంపాదనతో సుఖవంతమైన జీవితం గడిపిన ఆయన, చివరకు ఆస్తులన్నీ కోల్పోయి జీవనోపాధి కోసం చిన్నపాత్రలు చేయాల్సిన పరిస్థితికి చేరుకున్నారు. 1984లో చిరంజీవి హీరోగా వచ్చిన "నాగు" ఆయన చివరి చిత్రం. హరనాథ్‌కు ఒక కుమారుడు శ్రీనివాసరాజు, ఒక కుమార్తె ఉన్నారు. శ్రీనివాసరాజు నిర్మాతగా ప్రభాస్‌తో "రాఘవేంద్ర" వంటి చిత్రాన్ని నిర్మించారు. అలాగే హరనాథ్ అల్లుడు జీవీజీ రాజు కూడా నిర్మాతగా పనిచేసి, పవన్ కళ్యాణ్ నటించిన "తొలిప్రేమ" వంటి చిత్రాలను నిర్మించారు.

Advertisement