Lee Sun Kyun: 'పారాసైట్' నటుడు లీ సన్ క్యూన్ కన్నుమూత.. కారులో శవమై కనిపించి.
ఆస్కార్ విన్నింగ్ చిత్రం 'పారాసైట్' ఫేమ్, దక్షిణ కొరియా నటుడు లీ సన్-క్యున్ (48) అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఈమేరకు దక్షిణ కొరియా అత్యవసర కార్యాలయం ప్రకటించింది. సెంట్రల్ సియోల్ పార్క్‌లోని ఓ కారులో బుధవారం లీ శవమై కనిపించారు. చట్టవిరుద్ధమైన మాదకద్రవ్యాల వినియోగం కేసులో లీ సన్-క్యున్ అభియోగాలు ఎదుర్కొంటున్నారు. దీంతో ఆయన కొన్ని నెలలుగా వార్తల్లో ఉంటూ వస్తున్నారు. లీ సన్-క్యున్ ఇంటి నుంచి బయటకు వెళ్లిన తర్వాత అతని భార్యకు సూసైడ్ నోట్‌గా కనిపించింది. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు. ఆ తర్వాత పోలీసులు గాలించగా.. సియోల్ పార్క్‌లోని ఓ కారులో విగత జీవిగా కనిపించారు.
లీ సన్-క్యూన్ గురించి..
1975లో జన్మించిన లీ మ్యూజికల్ థియేటర్‌లో తన సినీ కెరీర్‌ను ప్రారంభించాడు. చాలా సంవత్సరాలు, అతను చిన్న, సహాయక పాత్రలు పోషించారు. 2007లో కాఫీ ప్రిన్స్ అనే ప్రసిద్ధ సీరియల్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తరువాత, అతని వైట్ టవర్, పాస్తా, గోల్డెన్ టైమ్, మై మిస్టర్ ప్రాజెక్టులు ప్రజాదరణను పొందాయి. 2019లో ఆస్కార్ విన్నింగ్ చిత్రం 'పారాసైట్'లో ధనిక తండ్రి పాత్రలో నటించి విశేష గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ చిత్రం 92వ అకాడమీ అవార్డులలో ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే, ఉత్తమ అంతర్జాతీయ చలనచిత్రంతో సహా నాలుగు ఆస్కార్‌లను గెలుచుకుంది. ఈ చిత్రం ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా గోల్డెన్ గ్లోబ్ అవార్డును కూడా అందుకుంది.