న్యూసెన్స్ టీజర్ రిలీజ్: రాజకీయాలే టార్గెట్ గా నవదీప్ కొత్త చిత్రం
ఓటీటీ వచ్చాక థియేటర్లకు దెబ్బపడిందన్నది నిజమే అయినా, చాలా కొత్త కంటెంట్ ఓటీటీ ద్వారా విడుదల అవుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహపడాల్సిన పనిలేదు. థియేటర్లలో ఆడవనుకునే జోనర్లలోనూ సినిమాలు తీసే సౌకర్యం ఓటీటీలు కల్పిస్తున్నాయి. దానివల్ల యాక్టర్లలోని కొత్తకొత్త కోణాలు బయటపడుతున్నాయి. ఓటీటీ అనేది యాక్టర్లకు మంచి అవకాశం. ఆ అవకాశాన్ని యాక్టర్ నవదీప్ సద్వినియోగం చేసుకుంటున్నాడనిపిస్తుంది. ఎందుకంటే గతకొన్ని రోజులుగా నవదీప్ సినిమాలు థియేటర్లలో రావట్లేదు. కానీ ఓటీటీలో ఒరిజినల్స్ పేరుతో వస్తూనే ఉన్నాయి. తాజాగా న్యూసెన్స్ అనే టైటిల్ తో సరికొత్త సినిమాతో వస్తున్నాడు నవదీప్. బిందు మాధవి హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ చిత్ర టీజర్, ఈరోజు విడుదలైంది.
జర్నలిస్టుగా కనిపించనున్న బిందుమాధవి
పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న న్యూసెన్స్ మూవీ, 2003 ప్రాంతంలోని కథను తెరమీద చూపించనుంది. ఇందులో బిందు మాధవి జర్నలిస్టుగా కనిపిస్తుందని టీజర్ లో అర్థమైంది. రాజకీయ నాయకుడు స్టేజి మీద మాట్లాడుతుంటే, అతని మీద చెప్పు విసరమన్నట్లు నవదీప్ పాత్ర సైగ చేస్తుంది. దాంతో చెప్పు విసురుతాడు గుంపులోని వ్యక్తి. ఆ తర్వాత అక్కడ గొడవ గొడవ జరుగుతుంది. ఆ గొడవలో, చెప్పు విసరమని చెప్పిన నవదీప్ ని చూస్తుంది బిందుమాధవి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో రూపొందుతున్న న్యూసెన్స్ మూవీని టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తుండగా, శ్రీ పవన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్న ఈ సినిమా, ఆహాలో స్ట్రీమింగ్ అవనుంది.