Prasad Behara: సెట్‌లో అసభ్య ప్రవర్తన.. నటుడు ప్రసాద్ బెహరా అరెస్ట్
యూట్యూబ్ వెబ్ సిరీస్‌లలో తన నటనతో గుర్తింపు తెచ్చుకున్న ప్రసాద్ బెహరా ఇప్పుడు తీవ్ర వివాదంలో చిక్కుకున్నాడు. మావిడాకులు, పెళ్లివారమండి వంటి వెబ్ సిరీస్‌లతో యువతలో మంచి క్రేజ్ తెచ్చుకున్న ప్రసాద్, తాజాగా కమిటీ కుర్రాళ్ళు సినిమాతో వెండితెర మీద తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న సమయంలో ఈ వివాదం ఎదురైంది. ప్రసాద్ బెహరా పై వెబ్ సిరీస్‌లో సహనటిగా నటించిన ఓ నటి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. ప్రసాద్ తనపై అసభ్యంగా ప్రవర్తించాడంటూ ఆమె ఆరోపణలు చేసింది. ఈ ఫిర్యాదులో ఆమె సంచలన ఆరోపణలు చేసింది. పెళ్లివారమండి వెబ్ సిరీస్ షూటింగ్ సమయంలో ప్రసాద్ తనను అసభ్యంగా తాకాడని పేర్కొంది. దీంతో షూట్ నుంచి తప్పుకున్నానని పేర్కొంది.
14 రోజులు రిమాండ్
ఇక ప్రసాద్ క్షమాపణలు చెప్పడంతో మెకానిక్ అనే మరో వెబ్ సిరీస్ లో మళ్లీ కలిసి పని చేశానని చెప్పింది. ఇక మెకానిక్ షూట్ సమయంలో ప్రసాద్ లొకేషన్‌లో అందరి ముందు అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించింది. ఈనెల 11వ తేదీన మధ్యాహ్నం సమయంలో, సెట్లో అందరి ముందు తన బ్యాక్‌పై అసభ్యంగా తాకాడని, దీనికి సంబంధించి ఆయనతో సమాధానం కోరగా సరైన జవాబులు రాలేదని తెలిపింది. తన బ్యాక్ గురించి, ముఖంపై ఉన్న వెంట్రుకల గురించి కూడా వల్గర్‌గా మాట్లాడారని ఫిర్యాదులో చెప్పింది. నటి ఇచ్చిన ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పోలీసులు 14వ తేదీన ప్రసాద్ బెహరాను అరెస్ట్ చేశారు. కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది.