ఫీఛర్ ఫిలిమ్ తో రాని గుర్తింపు షార్ట్ ఫిలిమ్ తో పొందిన షఫి, కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్ కు నామినేట్
సినిమా ఇండస్ట్రీ విచిత్రంగా ఉంటుంది. ఏ సినిమా ఎప్పుడు సక్సెస్ అవుతుందో, ఏ ఆర్టిస్టుకు ఎప్పుడు సక్సెస్ వస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. ఒక్కోసారి ఆ ఆర్టిస్టు పనైపోయిందనుకుంటే అనూహ్యంగా అద్భుత విజయాలతో ఆకాశంలోకి వెళ్ళిపోతారు. అందుకే సినిమా ఇండస్ట్రీ కళల ప్రపంచమే కాదు కలల ప్రపంచం కూడా. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, తాజాగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ షఫి, కేన్స్ వరల్డ్ ఫిలిమ్ ఫెస్టివల్ కి నామినేట్ అయ్యాడు. అలా అని సినిమాలో నటించినందుకు అనుకుంటే పొరపాటే. ఒక షార్ట్ ఫిలిమ్ లోని తన నటనకు గాను కేన్స్ వరల్డ్ ఫిలిమ్ ఫెస్టివల్ కి షఫి నామినేట్ అయ్యారు. అవును, 3:15AM అనే షార్ట్ ఫిలిమ్ లో నటించినందుకు నామినేట్ అయ్యారు షఫి.
అసలు ఊహించలేదంటున్న యాక్టర్ షఫి
బెస్ట్ యాక్టర్ విభాగంలో కేన్స్ వరల్డ్ ఫిలిమ్ ఫెస్టివల్ కి నామినేట్ కావడం, అస్సలు ఊహించలేదనీ, ఇది గౌరవంగా భావిస్తున్నానని షఫి చెప్పుకొచ్చారు. షార్ట్ ఫిలిమ్ గురించి మాట్లాడుతూ, డైరెక్టర్ అమిత్, తన దగ్గరికి వచ్చినపుడు ఎలాంటి సంకోచం లేకుండా ఒప్పేసుకున్నట్లు చెప్పాడు షఫి. షఫి ఇప్పటివరకు 50కి పైగా సినిమాల్లో నటించారు. కానీ ఎక్కడా కూడా సరైన బ్రేక్ అందలేదు. ఖడ్గంలో విలన్ పాత్ర, ఛత్రపతి సినిమాలో ప్రభాస్ తమ్ముడి పాత్ర కొంత పేరు తీసుకొచ్చాయి. తర్వాత చేసిన సినిమాలేవీ పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు కానీ, ఒక చిన్న షార్ట్ ఫిలిమ్ తో కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్ గుర్తించింది. దీంతో చాలా ఆనందంలో ఉన్నాడు షఫి.