Hayden Panettiere: 36 ఏళ్లకే నటి అనుమానాస్పద మృతి.. 'హీరోస్' ఫేమ్ హేడెన్ పానెటెర్ కన్నుమూత
ఈ వార్తాకథనం ఏంటి
హాలీవుడ్ ప్రముఖ నటి, సూపర్‌హిట్ వెబ్ సిరీస్ 'హీరోస్' ఫేమ్ హేడెన్ పానెటెర్ (Hayden Panettiere) 36 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆమె పుట్టినరోజు ఆగస్టు 21న జరగాల్సి ఉండగా.. దానికి కేవలం నాలుగు రోజుల ముందే ఈ విషాదం చోటుచేసుకుంది. హేడెన్ ఇక లేరనే విషయాన్ని ఆమె ప్రతినిధి మీడియాకు అధికారికంగా వెల్లడించారు. ఆదివారం ఆమె మృతి చెందినట్లు తెలిపారు. అయితే హేడెన్ మరణానికి గల కారణాలను మాత్రం ఆమె ప్రతినిధి వెల్లడించలేదు. మరోవైపు పోలీసులు ఈ ఘటనను అనుమానాస్పద మృతిగా నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆమె మృతికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
వివరాలు
11 నెలల వయసులోనే కెమెరా ముందుకు..
1989 ఆగస్టు 21న న్యూయార్క్‌లో జన్మించిన హేడెన్.. కేవలం 11 నెలల వయసులోనే ఓ ప్రకటనలో నటించారు.
1994లో బాలనటిగా తన కెరీర్‌ను ప్రారంభించారు. చిన్న వయసులోనే నటనలోకి వచ్చిన ఆమె.. ఆ తర్వాత హాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
సూపర్‌హిట్ వెబ్ సిరీస్ 'హీరోస్'లో క్లేర్ బెన్నెట్ పాత్ర హేడెన్‌కు అంతర్జాతీయ స్థాయిలో భారీ గుర్తింపును తీసుకొచ్చింది.
అనంతరం 'నాష్‌విల్లె' వంటి టీవీ సిరీస్‌లతో పాటు 'రిమెంబర్ ది టైటాన్స్', 'స్క్రీమ్ 4' వంటి విజయవంతమైన చిత్రాల్లోనూ నటించి ప్రేక్షకులను మెప్పించారు.
వివరాలు
ఆత్మకథలో సంచలన విషయాలు..
ఈ ఏడాదే హేడెన్ పానెటెర్ 'దిస్ ఈజ్ మీ: ఎ రెకనింగ్' పేరుతో తన ఆత్మకథను విడుదల చేశారు.
చిన్న వయసులోనే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టడం వల్ల తాను ఎదుర్కొన్న సవాళ్లు, మానసిక ఒత్తిడి, అడిక్షన్‌కు సంబంధించిన సమస్యల గురించి అందులో ఆమె వివరించారు.
కెరీర్ పరంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హేడెన్.. కేవలం 36 ఏళ్ల వయసులోనే మృతి చెందడం హాలీవుడ్‌లో విషాదాన్ని నింపింది.
ఆమె ఆకస్మిక మరణవార్తతో అభిమానులు, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు.