Pavala shyamala: సినీ నటి పావలా శ్యామల ఇకలేరు
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ నటి పావలా శ్యామల (75) కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే అర్ధరాత్రి తర్వాత గుండెపోటు రావడంతో ఆమె తుదిశ్వాస విడిచినట్లు ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆమె భౌతికకాయాన్ని ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. గత కొన్ని సంవత్సరాలుగా వృద్ధాప్య సమస్యలతో పాటు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను కూడా ఆమె ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో సినీ నటులు పవన్ కళ్యాణ్, సాయి దుర్గ తేజ్, నిర్మాత దిల్ రాజుతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఆమెకు ఆర్థిక సహాయం అందించిన విషయం తెలిసిందే.
వివరాలు
పూరీ సినిమాలతో ఫేమస్..
1951లో ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా అమరావతిలో జన్మించిన పావలా శ్యామల అసలు పేరు నేతి శ్యామల.
చిన్న వయసులోనే తల్లిని కోల్పోయిన ఆమె పదో తరగతి వరకు విద్యాభ్యాసం పూర్తి చేశారు.
1985లో విడుదలైన 'బాబాయ్ అబ్బాయ్' చిత్రంతో సినీ రంగంలోకి ప్రవేశించిన శ్యామల, దర్శకుడు కె. విశ్వనాథ్ తెరకెక్కించిన 'స్వర్ణకమలం' సినిమాతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు.
అనంతరం కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన 'ఖడ్గం' చిత్రంలో సహాయ నటి పాత్రలో తన నటనతో ప్రశంసలు అందుకున్నారు.
పూరి జగన్నాథ్ 'ఆంధ్రావాలా' సినిమాలో 'పావలా' అనే పాత్రను పోషించడంతో ఆమెకు 'పావలా శ్యామల' అనే పేరు శాశ్వతంగా నిలిచిపోయింది.