Priya Bhavani Shankar: 'ఇరుముడి'లో రవితేజను సరికొత్త కోణంలో చూస్తారు: ప్రియా భవానీ శంకర్
ఈ వార్తాకథనం ఏంటి
''బలమైన భావోద్వేగాలతో కూడిన యాక్షన్ థ్రిల్లర్‌గా 'ఇరుముడి' ప్రేక్షకుల ముందుకు రాబోతోంది'' అని నటి ప్రియా భవానీ శంకర్ తెలిపారు. రవితేజ సరసన ఆమె నటించిన ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 21న థియేటర్లలో విడుదల కానుంది. సినిమా విడుదల నేపథ్యంలో శనివారం మీడియాతో మాట్లాడిన ప్రియా భవానీ శంకర్ పలు విశేషాలను వెల్లడించారు.
వివరాలు
కావేరి అనే సాధారణ గృహిణి పాత్రలో హీరోయిన్..
ట్రైలర్ చూస్తే సినిమా కథపై ఇప్పటికే కొంత అవగాహన వచ్చి ఉంటుందని ఆమె అన్నారు.
''ఇందులో నేను కావేరి అనే సాధారణ గృహిణి పాత్రలో కనిపిస్తాను. ఆమె జీవితమంతా భర్త, కుమార్తె చుట్టూనే తిరుగుతుంటుంది.
భర్తకు మద్యం అలవాటు ఉండగా.. కూతురు అల్లరి చేస్తుంటుంది. ఈ ఇద్దరినీ సమన్వయం చేసుకుంటూ కుటుంబాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకునే మహిళగా కావేరి పాత్ర ఉంటుంది.
ఇప్పటివరకు నా కెరీర్‌లో ఇలాంటి పాత్రను చేయలేదు. అందుకే ఇది నాకు కూడా ఒక కొత్త అనుభూతిని ఇచ్చింది.
మన చుట్టూ ఉన్న నిజ జీవితంలో కావేరి వంటి మహిళలను చూస్తుంటాం.
అందువల్ల ఈ పాత్ర ప్రేక్షకులందరికీ సులభంగా అనుసంధానమయ్యేలా ఉంటుంది'' అని చెప్పారు.
వివరాలు
సరికొత్తగా రవితేజ..
దర్శకుడు శివ నిర్వాణ కథలు, పాత్రలను చాలా లోతుగా ఆవిష్కరిస్తారని ప్రియా భవానీ శంకర్ తెలిపారు.
''ఆయన నాకు కథ చెప్పిన సమయంలోనే దాన్ని ఆయన ఊహించిన విధానం, నా పాత్రను డిజైన్ చేసిన తీరు బాగా నచ్చాయి.
ముఖ్యంగా సినిమాలో తండ్రీకూతుళ్ల మధ్య ఉండే అనుబంధం, భావోద్వేగాలు అందరికీ సుపరిచితమైనవే. ఆ పాత్రలు ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోతాయి.
రవితేజతో కలిసి పనిచేయడం నాకు గొప్ప అనుభవం. ఆయనలో ఉండే ఎనర్జీ అద్భుతంగా ఉంటుంది. దానికి తగ్గట్టుగా నటించడం అంత సులభం కాదు.
అయితే 'ఇరుముడి'లో ఆయనతో కలిసి పనిచేసిన సమయంలో మాత్రం నాకు ఆయన సరికొత్త రవితేజలా అనిపించారు'' అని ఆమె పేర్కొన్నారు.