Actress Subhashini Suicide: వీడియో కాల్‌లో వాగ్వాదం.. ఆత్మహత్య చేసుకున్న నటి సుభాషిణి
ఈ వార్తాకథనం ఏంటి
చెన్నై నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. వీడియో కాల్‌లో భర్తతో వాగ్వాదం అనంతరం మనస్థాపానికి గురై ఓ నటి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సినీ వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. పోరూరులో నివసిస్తున్న నటి సుభాషిణి (36) తన నివాసంలోని ప్రైవేట్ అపార్ట్‌మెంట్‌లో ఉరివేసుకుని మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోరూర్ పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. శ్రీలంకకు చెందిన సుభాషిణి, తన భర్త పిప్పిన్‌తో కలిసి బెంగళూరులో నివసించేది. అయితే షూటింగ్‌ల నిమిత్తం చెన్నైలోని పోరూరులో ఒంటరిగా ఉంటూ టీవీ సీరియల్స్, సినిమాల్లో నటన కొనసాగిస్తోంది.
వివరాలు
పలువురు ప్రముఖుల సంతాపం
ముఖ్యంగా 'కయల్' టీవీ సీరియల్ ద్వారా ఆమెకు మంచి గుర్తింపు లభించింది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే సుభాషిణి ఇన్‌స్టాగ్రామ్‌లో గణనీయమైన ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం, మంగళవారం రాత్రి భర్తతో వీడియో కాల్‌లో మాట్లాడుతున్న సమయంలో వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. అనంతరం తీవ్ర మనస్థాపానికి గురైన సుభాషిణి ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కుటుంబ సమస్యలే ఈ ఘటనకు కారణమై ఉండవచ్చని ఆమె స్నేహితులు చెబుతున్నారు. ఈ సంఘటనతో సినీ పరిశ్రమతో పాటు అభిమానుల్లో తీవ్ర విషాదం నెలకొంది. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి రావాల్సి ఉంది.