సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న ఆదిపురుష్: రన్ టైం ఎంతంటే?
భారత ఇతిహాసమైన రామాయణాన్ని వెండితెర మీద కనీవినీ ఎరుగని రీతిలో ఆవిష్కరించడానికి బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఆదిపురుష్ చిత్రాన్ని తెరకెక్కించాడు. ప్రభాస్ రాముడిగా కనిపిస్తున్న ఈ చిత్రం జూన్ 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇటీవల తిరుపతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుని ప్రచార కార్యక్రమాలను ఘనంగా మొదలుపెట్టింది. తాజాగా ఆదిపురుష్ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని, యు సర్టిఫికెట్ తెచ్చుకుంది. అలాగే ఆదిపురుష్ రన్ టైం పై క్లారిటీ వచ్చింది. సిల్వర్ స్క్రీన్ పై త్రీడీలో కనిపించబోతున్న ఈ సినిమా, 2గంటల 59నిమిషాలు ఉండనుందట. అంటే దాదాపు మూడు గంటలు అన్నమాట.
పదివేల టిక్కెట్లను ఫ్రీగా పంపిణీ చేస్తున్న అభిషేక్ అగర్వాల్
మూడు గంటల పాటు రామాయణ గాథను థియేటర్లలో తిలకించే అవకాశం ఆదిపురుష్ అందిస్తోంది. ఆదిపురుష్ పై రోజురోజుకీ అంచనాలు పెరిగిపోతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మొదటి రోజున వసూళ్లు భారీగా ఉండే అవకాశం ఉందని ఊహిస్తున్నారు. ఆదిపురుష్ ప్రదర్శనమవుతున్న ప్రతీ థియేటర్లలో, హనుమంతుడి ఆసనంగా ఒక సీటును ఖాళీగా ఉంచాలని చిత్ర బృందం నిర్ణయం తీసుకుంది. అలాగే అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ యజమాని అభిషేక అగర్వాల్, తెలంగాణ వ్యాప్తంగా పదివేల ఆదిపురుష్ టికెట్లను ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు, అనాథ శరణాలయాలకు వృద్ధాశ్రమాలకు ఉచితంగా ఇవ్వనున్నారు. ఆదిపురుష్ సినిమాలో రాముడిగా ప్రభాస్, సీతగా క్రితి సనన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, రావణాసురుడిగా సైఫ్ ఆలీ ఖాన్ నటిస్తున్నారు.