థియేటర్లలో ఒక సీటును ఖాళీ ఉంచాలని ఆదిపురుష్ నిర్ణయం: ఆనందంలో హనుమాన్ భక్తులు
ఆదిపురుష్ సినిమా మరికొద్ది రోజుల్లో థియేటర్లలోకి రానుంది. ప్రభాస్ రాముడిగా, క్రితిసనన్ సీతగా కనిపిస్తున్న ఈ వెండితెర దృశ్యకావ్యాన్ని చూడాలని అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్, ఈరోజు తిరుపతిలో జరగనుంది. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ మైదానంలో సాయంత్రం 6గంటల నుండి ప్రీ రిలీజ్ కార్యక్రమం మొదలు కానుంది. ప్రమోషన్ కార్యక్రమాలను ప్రీ రిలీజ్ ఈవెంట్ నుండే మొదలుపెట్టనున్న ఆదిపురుష్ బృందం, తాజాగా అద్భుతమైన నిర్ణయాన్ని తీసుకుంది. ఆదిపురుష్ ప్రదర్శితమయ్యే ప్రతీ థియేటర్ లో ఒక సీటును ఖాళీ ఉంచుతామని తెలియజేసింది. అంటే, ఆ సీటును ఎవరూ కొనుక్కోలేరన్నమాట.
హనుమంతుడి కోసం ఆసనం
ప్రతీ థియేటర్ లో ఒక సీటును వదిలివేయడానికి కారణం ఏంటంటే, సాధారణంగా రామాయణ కథను చెప్పేటపుడు అక్కడ హనుమంతుడి కోసం ఒక ఆసనాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ పద్దతిని పాటిస్తూ, ఆదిపురుష్ ప్రదర్శితమయ్యే అన్ని థియేటర్లలో ఒక సీటును వదిలివేస్తామని, అది హనుమంతుడి కోసం కేటాయించబడిన సీటు అని తెలియజేసింది. ఆదిపురుష్ చిత్రబృందం తీసుకున్న నిర్ణయానికి హనుమాన్ భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆదిపురుష్ చిత్రంలో లక్ష్మణుడిగా సన్నీసింగ్, రావణాసురుడిగా సైఫ్ ఆలీ ఖాన్ నటిస్తున్నారు. టీ సిరీస్, రెట్రో ఫైల్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా, జూన్ 16వ తేదీన థియేటర్లలోకి రానుంది.