తెలుగు రాష్ట్రాల్లో ఆదిపురుష్ థియేట్రికల్ హక్కులకు భారీ ధర: ఎవరు సొంతం చేసుకున్నారంటే?
రాముడిగా ప్రభాస్, సీతగా క్రితిసనన్ నటించిన ఆదిపురుష్ చిత్రం జూన్ 16వ తేదీన థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలైపోయాయి. తాజాగా ఆదిపురుష్ నుండి రామ్ సీతారామ్ పేరుతో పాట రిలీజైంది. ఐదు భాషల్లో రిలీజైన ఈ పాటకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. ఆదిపురుష్ టీజర్ రిలీజయ్యాక కనిపించిన నెగెటివిటీ ట్రైలర్ రిలీజ్ తో తుడిచి పెట్టుకుపోయింది. ఇప్పుడు ఆదిపురుష్ పై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఆ అంచనాల కారణంగానే తెలుగు రాష్ట్రాల్లో ఆదిపురుష్ థియేట్రికల్ హక్కులకు భారీగా డిమాండ్ ఉంది. తాజా సమాచారం ప్రకారం, దాదాపు 160కోట్ల రూపాయలకు థియేట్రికల్ హక్కులు అమ్ముడయ్యాయని తెలుస్తోంది.
థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకున్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ చేజిక్కించుకుందని అంటున్నారు. భారత ఇతిహాసమైన రామయణాన్ని కనివినీ ఎరుగని రీతిలో వెండితెర మీద ఆదిపురుష్ సినిమా ద్వారా చూపించబోతున్నారు దర్శకుడు ఓం రౌత్. ఇందులో లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతుడిగా దేవ్ దత్ నాగి, రావణాసురుడిగా సైఫ్ ఆలీ ఖాన్ నటిస్తున్నారు. ఈ సినిమాను టీ సిరీస్ బ్యానర్, రెట్రో ఫైల్స్ బ్యానర్లపై భూషన్ కుమార్, క్రిషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ నిర్మిస్తున్నారు. 500కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాను త్రీడీ వెర్షన్ లో చూడవచ్చు.