Akshaye Khanna: 'ఛావా', 'ధురంధర్' తర్వాత.. అసురగురువుగా అదరగొట్టిన అక్షయ్ ఖన్నా!
ఈ వార్తాకథనం ఏంటి
కథలో తన పాత్ర ఎంతసేపు కనిపిస్తుందనేది కాదు.. తెరపై ఆ పాత్ర ఎంత బలంగా ప్రభావం చూపిస్తుందన్నదే తనకు ముఖ్యమని బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా భావిస్తారు. అందుకే సినిమాల ఎంపికలో ఆయన ఎంతో ఆచితూచి వ్యవహరిస్తుంటారు. గతేడాది 'ఛావా'లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుగా కనిపించి ప్రేక్షకులను మెప్పించిన అక్షయ్ ఖన్నా.. ఆ తర్వాత 'ధురంధర్'లో రెహమాన్ బలోచ్ పాత్రలో తనదైన నటనతో ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఈ రెండు పాత్రలకు పూర్తిగా భిన్నమైన క్యారెక్టర్‌లో కనిపించేందుకు సిద్ధమవుతున్నారు. పురాణ నేపథ్యంతో తెరకెక్కుతున్న 'మహాకాళి'లో ఆయన అసురగురువు శుక్రాచార్యుడి పాత్రను పోషిస్తున్నారు.
వివరాలు
మొఘల్ చక్రవర్తి నుంచి గ్యాంగ్‌స్టర్ వరకు..
'ఛావా'లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుగా అక్షయ్ ఖన్నా కనిపించారు. ఆ సినిమాలో ఆయన పోషించిన పాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
పెద్దగా సంభాషణలు లేకపోయినా.. కేవలం చూపులు, హావభావాలతోనే ఔరంగజేబు పాత్రకు ప్రాణం పోశారు. ఆయన చూపించిన గాంభీర్యం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
ఆ తర్వాత వచ్చిన 'ధురంధర్'లో అక్షయ్ ఖన్నా రెహమాన్ బలోచ్‌గా కనిపించారు. ఈ పాత్రలోని క్రూరత్వాన్ని, ప్రత్యేకమైన మేనరిజమ్స్‌ను ఆయన అద్భుతంగా పలికించారు.
ముఖ్యంగా అక్షయ్ ఖన్నా ఎంట్రీ సన్నివేశాలు, ఆయన నటన సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి.
దీంతో 'ఛావా', 'ధురంధర్' చిత్రాల్లో ఆయన పోషించిన పాత్రలు.. కథలోని ప్రధాన పాత్రధారులకు ఏమాత్రం తీసిపోని స్థాయిలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి.
వివరాలు
ఇప్పుడు అసురగురువుగా..
ప్రస్తుతం అక్షయ్ ఖన్నా నటిస్తున్న 'మహాకాళి'పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరగడానికి ప్రధాన కారణం ఆయన పోషిస్తున్న శుక్రాచార్యుడి పాత్రే. పురాణాల ప్రకారం శుక్రాచార్యుడు అసురులకు గురువుగా వ్యవహరిస్తారు.
దేవతలు, అసురుల మధ్య జరిగే పోరాటాల్లో రాక్షసులకు మార్గనిర్దేశం చేసే కీలకమైన వ్యక్తిగా ఆయనను పేర్కొంటారు.
అంతేకాదు.. చనిపోయిన రాక్షసులను సైతం తిరిగి బతికించే శక్తి శుక్రాచార్యుడికి ఉందనే విశ్వాసం పురాణాల్లో కనిపిస్తుంది.
ఇలాంటి శక్తివంతమైన పాత్ర కావడంతోనే అక్షయ్ ఖన్నా ఈ క్యారెక్టర్‌ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
తాజాగా ఆయన పాత్రను పరిచయం చేస్తూ 'శుక్రాచార్య వార్ క్రై' పేరుతో ఓ వీడియోను విడుదల చేశారు. ఇందులో అక్షయ్ ఖన్నా చెప్పే డైలాగ్ పాత్ర తీవ్రతను తెలియజేస్తోంది.
వివరాలు
లుక్ అదుర్స్..
'అమృత మథన సమయమున దేవతలతో సమానముగా దానవులు శ్రమించినా.. ఆ విష్ణువు అమృతమును దేవగణానికే ప్రసాదించాడు.
ఇది ధర్మమా.. అధర్మమా?'' అంటూ ఆయన చెప్పే సంభాషణ ఆకట్టుకుంటోంది. ఈ డైలాగ్ ద్వారా సినిమాలో శుక్రాచార్యుడి పాత్ర ఏ స్థాయిలో ఉండబోతుందనే ఆసక్తి పెరుగుతోంది.
'శుక్రాచార్య వార్ క్రై' గ్లింప్స్‌లో అక్షయ్ ఖన్నా లుక్ ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
తెల్లటి గడ్డం, తీక్షణమైన కళ్లు, గంభీరమైన వేషధారణతో ఆయన కనిపించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
ఇప్పటివరకు మొఘల్ చక్రవర్తిగా, గ్యాంగ్‌స్టర్‌గా మెప్పించిన అక్షయ్.. ఇప్పుడు అసురగురువు పాత్రలో ఎలాంటి నటనను చూపిస్తారోనన్న ఆసక్తి నెలకొంది.