Jana Nayagan: జన నాయగన్ లో నా సన్నివేశాలన్నీ కట్ చేశారు.. నటి ఆవేదన
ఈ వార్తాకథనం ఏంటి
దళపతి విజయ్ హీరోగా తెరకెక్కిన 'జన నాయగన్' (Jana Nayagan) ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా విడుదల తర్వాత నటి ఆనంది అజయ్ భావోద్వేగానికి గురయ్యారు. చిత్రంలో తనకు సంబంధించిన సన్నివేశాలన్నింటినీ తొలగించారని ఆరోపిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో విడుదల చేసి కన్నీటి పర్యంతమయ్యారు. ఆ వీడియోలో మాట్లాడిన ఆనంది అజయ్.. 'జన నాయగన్' కోసం దాదాపు ఏడాది పాటు ఎంతో కష్టపడ్డానని తెలిపారు. విజయ్ చివరి సినిమా కావడంతో ఆయనతో కలిసి పనిచేసే అవకాశం రావడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని చెప్పారు. కానీ సినిమా విడుదలైన తర్వాత తన సన్నివేశాలు పూర్తిగా తొలగించబడటం తీవ్రంగా బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
వివరాలు
'జన నాయగన్' చిత్రంలో 12 కీలక మార్పులు
పలు టెలివిజన్ సీరియల్స్‌లో నటించిన ఆనంది అజయ్.. క్లాసికల్ డ్యాన్సర్, యోగా ట్రైనర్‌గా కూడా మంచి గుర్తింపు పొందారు.
అలాగే 'డాన్స్ జోడి డాన్స్ 3.0', 'జోడి నంబర్ 1' వంటి రియాలిటీ షోల ద్వారా ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు.
ఇదిలా ఉండగా సెన్సార్ బోర్డు సూచనల మేరకు 'జన నాయగన్' చిత్రంలో 12 కీలక మార్పులు చేసినట్లు ఇప్పటికే సమాచారం వెలువడింది.
సెన్సార్ పరమైన కారణాలతోనే ఆనంది అజయ్‌కు సంబంధించిన సన్నివేశాలు తొలగించి ఉండొచ్చని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
జులై 23న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన 'జన నాయగన్' తొలి రోజే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.