Prasanth Varma: అవన్నీ తప్పుడు ప్రచారాలే.. ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రశాంత్ వర్మ!
ఈ వార్తాకథనం ఏంటి
దర్శకుడు ప్రశాంత్ వర్మ (Prasanth Varma) తనపై పలు వార్తా ఛానళ్లు, సోషల్‌మీడియా వేదికల్లో ప్రచారంలో ఉన్న సమాచారం పూర్తిగా తప్పుడు, నిరాధారమని స్పష్టం చేశారు. తనను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుని, వ్యక్తిగతంగా దూషించే విధంగా అసత్య ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. 'హను-మాన్' సినిమా తర్వాత 'అధీర', 'మహాకాళీ', 'జై హనుమాన్', 'బ్రహ్మరాక్షస' వంటి ప్రాజెక్టులు చేయాలంటూ రూ.10.34 కోట్లు అడ్వాన్స్ తీసుకుని, ఆ తర్వాత పనిని కొనసాగించలేదని నిర్మాత నిరంజన్ రెడ్డి తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌కు ఫిర్యాదు చేశారని పలు వార్తా కథనాలు వెలువడిన విషయం తెలిసిందే.
Details
అందుకే స్పందించాల్సిన వచ్చింది
అలాగే ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ ఫిర్యాదు చేసినట్లు సోషల్‌మీడియా వేదికల్లో కూడా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే తాను స్పందించాల్సిన అవసరం ఏర్పడిందని ప్రశాంత్ వర్మ వివరించారు. 'ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఫిర్యాదు చేసినట్లు మీడియాలో, సోషల్‌మీడియా వేదికల్లో వస్తున్న వార్తలను గమనించాను. ఈ ప్రచారానికి సంబంధించి కొన్ని అంశాలపై స్పష్టత ఇవ్వాలనుకుంటున్నా. బాధ్యతారాహిత్యంగా, ధృవీకరించని సమాచారాన్ని ప్రచారం చేయడం తప్పు. నేను, ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ మధ్య ఉన్న వివాదం ప్రస్తుతం పెండింగ్‌లో ఉంది.
Details
తననిర్ధారణ లేని సమాచారాన్ని ప్రసారం చేయొద్దు
ఈ విషయం తెలుగు ఫిల్మ్ ఛాంబర్, తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ పరిశీలనలో ఉంది. ఈ సంస్థలు సమగ్ర విచారణ జరిపి, తగిన నిర్ణయం తీసుకుంటాయి. అంతవరకు మీడియా వివాదాలను రేకెత్తించేలా వార్తలు ప్రసారం చేయకూడదు. నా మీద వస్తున్న ఆరోపణలన్నీ పూర్తిగా నిరాధారమైనవి, అసత్యమైనవి. మీడియా సంస్థలు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు, సోషల్‌మీడియా ఛానల్స్ అసంపూర్ణమైన, నిర్ధారణ లేని సమాచారాన్ని ప్రసారం చేయకూడదని విజ్ఞప్తి చేస్తున్నా. ఈ విషయంలో వచ్చే తదుపరి వివరాలు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ద్వారా అధికారికంగా తెలియజేయబడతాయని ప్రశాంత్ వర్మ తన ప్రకటనలో పేర్కొన్నారు.