జవాన్ సినిమాపై అల్లు అర్జున్ ట్వీట్ వైరల్: అట్లీని ఆకాశానికెత్తేసిన ఐకాన్ స్టార్
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ నటించిన జవాన్ సినిమా థియేటర్ల వద్ద దుమ్ము దులుపుతున్న సంగతి తెలిసిందే. అట్లీ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో వసూళ్ల మూత మోగిస్తోంది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులే కాదు, సినిమా సెలబ్రిటీలు కూడా తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇదివరకు రాజమౌళి, మహేష్ బాబు జవాన్ సినిమాపై ప్రశంసలు కురిపించారు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జవాన్ సినిమాపై పొగడ్తల జల్లు కురిపించారు. జవాన్ సినిమాలో షారుక్ ఖాన్ మాస్ అవతారం కనిపించిందని, షారుక్ ఖాన్ స్వాగ్ అదిరిపోయిందని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు.
పేరు పేరునా పొగిడిన అల్లు అర్జున్
జవాన్ సినిమాలో విలన్ గా నటించిన విజయ్ సేతుపతి, అతిథి పాత్రలో కనిపించిన దీపికా పదుకొణె, హీరోయిన్ నయనతార, సంగీతం అందించిన అనిరుధ్ రవిచందర్ పేర్లను ట్యాగ్ చేస్తూ అందరినీ పొగడ్తలతో అల్లు అర్జున్ ముంచెత్తారు. అంతేకాదు దర్శకుడు అట్లీ పేరుని ట్యాగ్ చేస్తూ, ఆలోచన రేకెత్తించే కమర్షియల్ సినిమాను తెరకెక్కించావని, భారత బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించావని అల్లు అర్జున్ అన్నారు. అట్లీపై పొగడ్తల జల్లు కురిపించడంతో అభిమానులందరూ అట్లీతో సినిమా ఎప్పుడు ఉండనుందని ప్రశ్నిస్తున్నారు. అట్లీని అంతలా పొగిడిన అల్లు అర్జున్, ఆయనతో సినిమా తీసే అవకాశం కచ్చితంగా ఉందని మరికొంతమంది అభిమానులు అంటున్నారు. మరి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఎప్పుడు మొదలవుతుందో చూడాలి.