Pushpa 2 Collection: 'పుష్ప2' ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా..!
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ 'పుష్ప: ది రూల్' (Pushpa 2) ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమా ప్రీ సేల్ బుకింగ్స్ నుంచే భారీ స్పందన సాధించి, విడుదలైన మొదటి రోజే అద్భుతమైన వసూళ్లు నమోదు చేసింది. డిసెంబర్ 4 రాత్రి నుంచి థియేటర్లలో సందడి మొదలైన ఈ చిత్రం, కలెక్షన్ల పరంగా ఓవర్సీస్ మార్కెట్‌లోనూ టాప్ స్థానంలో నిలిచింది. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం, ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తొలి రోజే రూ.175 కోట్ల వసూళ్లు సాధించింది. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు అత్యధికంగా ఉన్నట్లు సమాచారం.
అమెరికాలో 4.2 మిలియన్ డాలర్లు
అమెరికాలో మాత్రమే తొలిరోజు ఈ చిత్రం దాదాపు 4.2 మిలియన్ డాలర్లు (రూ.35 కోట్ల పైగా) వసూలు చేయగా, ఈ విషయాన్ని నిర్మాతలు పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. 'పుష్ప 2' అమెరికాలో ఈ స్థాయిలో వసూళ్లు సాధించిన మూడవ భారతీయ చిత్రంగా నిలిచింది. ఇక బుక్ మై షోలో ప్రీ సేల్ బుకింగ్స్ సమయంలోనే సినిమా భారీ దూకుడు చూపింది. తాజాగా, ఒక్క గంటలోనే లక్ష టికెట్లు అమ్ముడవ్వడం విశేషం. ఇంతకుముందు ప్రభాస్ నటించిన 'కల్కి 2898 AD' సినిమా గంటలో 97,700 టికెట్లు విక్రయించి టాప్‌లో ఉండగా, ఇప్పుడు ఆ రికార్డును పుష్పరాజ్ బ్రేక్ చేశాడు.