#NewsBytesExplainer: అల్లు అర్జున్ అరెస్ట్.. రిమాండ్ నుంచి హైకోర్టు బెయిల్ వరకు జరిగిన పరిణామాలు ఇవే!
డిసెంబరు 4 రాత్రి హైదరాబాద్‌లో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందడం, ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్ర గాయాలపాలవడంతో సినీ నటుడు అల్లు అర్జున్‌పై కేసు నమోదైంది. పోలీసులు ఆయనను అరెస్టు చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు తొలుత 14 రోజుల రిమాండ్ విధించినా, హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. డిసెంబరు 5న విడుదలైన 'పుష్ప 2 ది రూల్' ప్రీమియర్ షో కోసం డిసెంబరు 4 రాత్రి 9.30 గంటల సమయంలో హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద ప్రత్యేక ప్రదర్శన నిర్వహించారు. ఆ సమయంలో అల్లు అర్జున్ థియేటర్‌కి వచ్చిన వేళ, భారీ జనసంద్రం నడుమ తొక్కిసలాట జరిగింది.
పలు సెక్షన్ల కింద కేసు నమోదు
ఈ ఘటనలో రేవతి (35) ప్రాణాలు కోల్పోగా, ఆమె కుమారుడు శ్రీతేజ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీసులు 376/2024 కేసు నమోదు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా సంధ్య థియేటర్ యాజమాన్యం, సిబ్బంది, అల్లు అర్జున్, ఆయన భద్రతా సిబ్బందిని చేర్చారు. రిమాండ్ రిపోర్టులో అల్లు అర్జున్‌ను 'ఎ11' గా పేర్కొన్నారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్‌పై బీఎన్ఎస్ యాక్ట్ 105, 118(1) రెడ్ విత్ 3(5) సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
బీఎన్ఎస్ యాక్ట్ 105
ఒక వ్యక్తి మరణానికి పరోక్ష కారణమైతే, ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేయవచ్చు. శిక్ష: కనీసం 5 ఏళ్ల జైలు శిక్ష నుంచి గరిష్ఠంగా జీవిత ఖైదు. 118(1) రెడ్ విత్ 3(5) ఎదుటి వ్యక్తిని గాయపరచడం, తీవ్ర గాయాలకు కారణమైనప్పుడు ఈ సెక్షన్ వర్తిస్తుంది. శిక్ష: 3 నుంచి 10 ఏళ్ల జైలు శిక్ష లేదా రూ. 20 వేల జరిమానా లేదా రెండూ.
ఇవాళ ఉదయం రిలీజ్
ఈ కేసులో ఇప్పటికే సంధ్య థియేటర్ యాజమానిని, మేనేజర్‌ను, లోయర్ బాల్కనీ ఇంచార్జిని అరెస్టు చేశారు. అల్లు అర్జున్‌కి కూడా నిర్లక్ష్యపు ఆరోపణల కింద కేసు పెట్టారు. అల్లు అర్జున్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా, న్యాయస్థానం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇక శుక్రవారం బెయిల్ ఆర్డర్స్ అధికారులకు అందేలోగా జైలు సమయం అయిపోయింది. దీంతో అల్లు అర్జున్ శనివారం ఉదయం 06: 30 గంటల ప్రాంతంలో రిలీజ్ అయ్యారు. దీంతో ఆయన నేరుగా ఇంటికి వెళ్లకుండా నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ ఘటనపై అభిమానులు, ప్రజల్లో విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.