
Amazon Prime Video: ప్రైమ్ వీడియోలో ప్రకటనలు వద్దనుకుంటే.. అదనపు చార్జ్ తప్పదు!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ సేవ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియోలో కీలక మార్పు చోటు చేసుకుంది.
ఇకపై ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించే వినియోగదారులకు వీడియోల మధ్యలో ప్రకటనలు (యాడ్స్) తప్పనిసరిగా కనిపించనున్నాయి.
ఈ కొత్త విధానం వచ్చే నెల నుంచి అమల్లోకి రానున్నట్టు సమాచారం. ఇకపై సినిమాలు, వెబ్ షోలను వీక్షించే సమయంలో మధ్యలో ప్రకటనలు ప్రసారమవుతాయి.
అయితే, యాడ్‌లు లేకుండా చూసే అనుభూతిని కోరుకునే వారికి అదనంగా చెల్లించాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని అమెజాన్ తమ యూజర్లకు ఇమెయిల్ ద్వారా తెలియజేస్తోంది.
వివరాలు
ప్రైమ్ మెంబర్‌షిప్ ధరలో ఎలాంటి మార్పులు లేదు
ప్రస్తుతం ఉన్న ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌తో యూజర్లు ఎలాంటి ప్రకటనలు లేకుండా కంటెంట్‌ను వీక్షిస్తున్నారు.
కానీ జూన్ 17, 2025 నుంచి ఈ విధానం మారబోతోంది. ఆ తేదీ నుండి పరిమిత సంఖ్యలో ప్రకటనలు స్ట్రీమింగ్‌లో భాగంగా కనిపించనున్నాయి.
అమెజాన్ ప్రకారం, మరింత మెరుగైన కంటెంట్ తయారీకి అవసరమైన పెట్టుబడి కోసం ఈ చర్య తీసుకున్నట్లు స్పష్టం చేసింది.
ఇది సంప్రదాయ టీవీ ఛానళ్లలాగా యాడ్స్‌ను ప్రసారం చేయక, తగిన సందర్భాలలో మాత్రమే ప్రయోజనకరమైన ప్రకటనలు చూపిస్తామని స్పష్టం చేసింది.
అంతేగాక, ప్రస్తుత ప్రైమ్ మెంబర్‌షిప్ ధరలో ఎలాంటి మార్పులు చేయడం లేదని వెల్లడించింది.
వివరాలు
కొత్త యాడ్-ఫ్రీ ప్లాన్లు జూన్ 17 నుంచి అందుబాటులోకి..
యాడ్‌లు లేకుండా చూడాలనుకునే వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రెండు అదనపు ప్లాన్లను అందుబాటులోకి తెచ్చారు.
ప్రస్తుతం ప్రైమ్ సభ్యత్వం ఉన్న వారు నెలకు రూ.129 లేదా సంవత్సరానికి రూ.699 చెల్లించి యాడ్-ఆన్ ప్యాకేజీలను తీసుకుంటే, స్ట్రీమింగ్ సమయంలో ఏ విధమైన ప్రకటనలు కనిపించవు.
ఈ కొత్త యాడ్-ఫ్రీ ప్లాన్లు జూన్ 17 నుంచి అందుబాటులోకి రానున్నాయి.
ఇదివరకు యూఎస్, యూకే, కెనడా, మెక్సికో, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో మాత్రమే ఈ ప్రకటనల విధానం అమలులో ఉండగా, ఇప్పుడు భారతదేశంలోనూ దీనిని ప్రారంభిస్తున్నట్టు తెలిపింది.
ఇప్పటికే ప్రైమ్ లైట్ ప్లాన్ తీసుకున్న వినియోగదారులకు ప్రకటనలు కనిపిస్తున్నాయని స్పష్టం చేసింది.