ట్విట్టర్: బ్లూ టిక్ కోసం డబ్బులు ఎందుకు కట్టాలంటూ అమితాబ్ ట్వీట్
మైక్రో బ్లాగింగ్ ఫ్లాట్ ఫామ్ ట్విట్టర్ లో రోజుకో వింత జరుగుతోంది. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలాన్ మస్క్, సీఈవో గా వచ్చినప్పటి నుండి ట్విట్టర్ లో రకరకాల ప్రయోగాలు జరుగుతున్నాయి. వెరిఫైడ్ ప్రొఫైల్స్ కోసం బ్లూ టిక్ కావాలంటే నెలసరి చందా లేదా సంవత్సర చందా కట్టాలని ఎలాన్ మస్క్ ఆదేశించిన సంగతి తెలిసిందే. తాజాగా సినిమా సెలెబ్రిటీలు అందరూ తమ బ్లూ టిక్ ని కోల్పోయారు. చందా చెల్లించిన వారికి, ఒకరోజు తర్వాత బ్లూ టిక్ వచ్చేసింది. అమితాబ్ బచ్చన్ కి కూడా ఒకరోజు తర్వాత బ్లూ టిక్ వచ్చేసింది. ఈ నేపథ్యంలో ట్విట్టర్ కు ఒక ప్రశ్న వేసారు అమితాబ్.
48.4 మిలియన్ల ఫాలోవర్లు
48.4మిలియన్ల ఫాలోవర్లు ఉన్నా కూడా బ్లూ టిక్ కావాలంటే ఎందుకు డబ్బులు కట్టాలని ట్విట్టర్ లో ప్రశ్నించారు అమితాబ్ బచ్చన్. ప్రస్తుతం ఈ ట్వీట్, వైరల్ గా మారుతోంది. ఐతే అమితాబ్ ట్వీట్ పై ఎలాన్ మస్క్ నుండి ఎలాంటి స్పందనా రాలేదు. సాధారణ నెటిజన్ల నుండి మాత్రం మంచి స్పందన వస్తోంది. బ్లూ టిక్ కోల్పోవడంతో చాలామంది సెలెబ్రిటీలు, బై బై బ్లూ టిక్ అంటూ, బ్లూ టిక్ మాకు అవసరం లేదని కామెంట్లు చేసారు. ట్విట్టర్ లో బ్లూ టిక్ కావాలంటే నెలకు 900రూపాయలు చెల్లించాలి. సంవత్సరానికి 6800రూపాయలు కట్టాలి. ట్విట్టర్ ని వెబ్ లో ఉపయోగించే వాళ్ళు నెలకు 650రూపాయలు చెల్లించాలి.