Amitabh Bachchan: రాత్రంతా షూటింగ్… బ్లాగ్ ఆలస్యంపై అభిమానులకు క్షమాపణలు చెప్పిన అమితాబ్ బచ్చన్!
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, 83 ఏళ్ల వయస్సులోనూ పని పట్ల చూపుతున్న అంకితభావంతో మళ్లీ అందరినీ ఆకట్టుకున్నారు. నిరంతర షూటింగ్ కారణంగా తన బ్లాగ్ అప్‌డేట్ ఆలస్యమైనందుకు అభిమానులకు క్షమాపణలు తెలిపారు. ఈ విషయం గురించి ఆయన తన టంబ్లర్ ఖాతాలో ఓ పోస్ట్ షేర్ చేశారు. ఉదయం 5:30 వరకు షూటింగ్‌లోనే ఉన్నాను. ఆ ఒత్తిడిలో బ్లాగ్‌లో ముఖ్యమైన అప్‌డేట్స్ ఇవ్వడం, స్పందించడం మర్చిపోయాను. అందుకు నిజంగా క్షమాపణలు కోరుతున్నానని బిగ్‌బీ రాశారు. ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ ప్రసిద్ధ రియాలిటీ గేమ్ షో 'కౌన్ బనేగా కరోడ్‌పతి' 17వ సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.
Details
కడుపుబ్బా నవ్విన అమితాబ్
ఈ షో రాబోయే ఎపిసోడ్‌లో ఓ వినోదభరిత ఘటన చోటుచేసుకుంది. కంటెస్టెంట్ సుభాష్ కుమార్ తన అద్భుతమైన మిమిక్రీతో అమితాబ్‌ను కడుపుబ్బా నవ్వించాడు. కేబీసీని నానా పటేకర్ హోస్ట్‌గా చేసి, సన్నీ డియోల్ కంటెస్టెంట్‌గా ఉంటే ఎలా ఉంటుందో సుభాష్ అనుకరించి చూపించాడు. నానా పటేకర్ గొంతు, హావభావాలు, వాటికి సన్నీ డియోల్ శైలి స్పందనలను కలిపి చేసిన ఈ మిమిక్రీ చూసి స్టూడియో మొత్తం నవ్వుల్లో మునిగిపోయింది. ముఖ్యంగా అమితాబ్ బచ్చన్ మాత్రం పగలబడి నవ్వారు. ఇటీవల అమితాబ్ బచ్చన్ - ప్రభాస్, దీపికా పదుకొణె, కమల్ హాసన్ నటించిన 'కల్కి 2898 ఏడీ' చిత్రంలో కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే.