
Hyderabad: ఇక పై షూటింగ్‌లు జరగవు.. ముదురుతున్న సినీ కార్మికుల,నిర్మాతల వివాదం
ఈ వార్తాకథనం ఏంటి
సినీ పరిశ్రమలో నిర్మాతలు,కార్మికుల మధ్య నెలకొన్న విభేదాలు మళ్లీ ముదురుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫెడరేషన్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని, నిర్మాతల వైఖరిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నిర్మాతలు తమ సౌకర్యానికి అనుగుణంగా, తాము కోరుకున్న వ్యక్తులతోనే పని చేయాలని ఒత్తిడి తెస్తున్నారని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా, కొంతమంది నిర్మాతలు సినీ కార్మికుల ప్రతిభను తక్కువ చేసి మాట్లాడుతున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు.
వివరాలు
పాత నిబంధనల ప్రకారమే పని
అనిల్ వల్లభనేని మాట్లాడుతూ.. "నిర్మాతలు తమ ఇష్టప్రకారం కాల్ షీట్లు కేటాయిస్తామని, మాకు నచ్చిన వారినే తీసుకుంటామని చెబుతున్నారు. ఇది పనిని తమ నియంత్రణలో ఉంచే ప్రయత్నమే కాకుండా, కొంతమంది కార్మికుల నైపుణ్యాలను అవమానించడం సరైన పని కాదు" అని స్పష్టం చేశారు. అలాగే, "మేము పాత నిబంధనల ప్రకారమే పని చేస్తామని నిర్మాతలకు ఇప్పటికే చెప్పాం. డాన్స్ ఫైటర్స్, టెక్నీషియన్ల వేతనాలను పెంచకుండా, వారిని 24 క్రాఫ్ట్స్ నుంచి వేరుచేయాలని యత్నిస్తున్నారు" అని ఆరోపించారు. "సినీ కార్మికులు ఇబ్బందులు పడ్డాక తిరిగి వస్తారని నిర్మాతలు అనుకోవడం అవమానకరం.వేతనాల పెంపు విషయంలో మాత్రమే మా స్కిల్స్ గుర్తొచ్చాయా?" అని ఆయన ప్రశ్నించారు.
వివరాలు
పీపుల్స్ మీడియా ₹90 లక్షల బకాయి
అన్ని కార్మిక సంఘాలను ఉద్దేశించి,"నిర్మాతల వలలో ఏ సంఘం పడకూడదు. మనమందరం ఐక్యంగా పోరాడాలి" అని పిలుపునిచ్చారు. ఇకపై ఎలాంటి షూటింగులు జరగవని కఠినంగా హెచ్చరించారు. అదే సమయంలో,"నిర్మాత విశ్వప్రసాద్ మాకు నోటీసులు ఎందుకు పంపారో అర్థం కావడం లేదు. మేము చర్చలు జరిపేది ఛాంబర్‌తో మాత్రమే.పీపుల్స్ మీడియా మాకు ₹90 లక్షల బకాయి చెల్లించాల్సి ఉంది.వేతనాల పెంపును నిర్మాతలు ఎందుకు పెద్ద సమస్యగా చూపిస్తున్నారు? ఛాంబర్‌తో చర్చలు జరపాలని చిరంజీవి సూచించారు. ఆయన మాతో నిరంతరం సంప్రదింపుల్లో ఉన్నారు. మంత్రి కోమటిరెడ్డి కార్మికుల పక్షాన నిలబడ్డారు" అని వెల్లడించారు. రాబోయే రెండు మూడు రోజుల్లో సమస్య పరిష్కారం కానట్లయితే, అన్ని కార్మిక సంఘాలు కలిసి ఛాంబర్‌ను ముట్టడించే అవకాశముందని ఆయన హెచ్చరించారు.