Anora: రికార్డుల మోత మోగించిన 'అనోరా'.. ఐదు అస్కార్ అవార్డులను గెలుచుకున్న మూవీ!
ఈ వార్తాకథనం ఏంటి
ఈ ఏడాది ఆస్కార్ వేదికపై అత్యంత హాట్ టాపిక్‌గా నిలిచిన సినిమా 'అనోరా'. తక్కువ బడ్జెట్‌తో రూపొందించినా ఈ చిత్రం ఐదు విభాగాల్లో విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది.
ముఖ్యంగా దర్శకుడు సీన్ బేకర్ ఒక్కసారిగా నాలుగు ఆస్కార్ అవార్డులను (ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ స్క్రీన్‌ప్లే, ఉత్తమ ఎడిటింగ్) అందుకుని సరికొత్త రికార్డు సృష్టించారు.
'ది బ్రూటలిస్ట్', 'ది సబ్‌స్టాన్స్', 'డ్యూన్ పార్ట్ 2', 'ఎమిలియా పెరెజ్' వంటి పోటీ చిత్రాలను వెనక్కు నెట్టి ఉత్తమ చిత్రంగా నిలిచిన 'అనోరా' గురించి ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో ఆసక్తి పెరిగింది.
మరి, ఈ సినిమా కథ ఏమిటి? ఎక్కడ వీక్షించొచ్చు?
Details
అనోరా కథ.. ఓ వేశ్య జీవితం ఆధారంగా!
ప్రస్తుతం హాలీవుడ్‌లో భారీ బడ్జెట్, యాక్షన్ చిత్రాల హవా కొనసాగుతుండగా, దర్శకుడు సీన్ బేకర్ మాత్రం విభిన్నమైన కథాంశాన్ని ఎంచుకున్నారు.
'రెడ్ రాకెట్', 'ది ఫ్లోరిడా ప్రాజెక్ట్' చిత్రాలను తెరకెక్కించిన ఆయన, 'అనోరా'ను మరో యూనిక్ ప్రాజెక్టుగా తీసుకొచ్చారు.
మైకీ మ్యాడిసన్, మార్క్ ఎడిల్జియన్, యురా బోరిసావ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం రొమాంటిక్ కామెడీ డ్రామా బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది.
కథ:
23 ఏళ్ల వేశ్య అయిన 'అని' బ్రూక్లిన్‌లో జీవిస్తోంది. ఓ రోజు రష్యన్ ఒలిగార్క్ కుమారుడు వన్యను కలుస్తుంది. అతను అనిపై ప్రేమ పెంచుకుని రహస్యంగా పెళ్లి చేసుకుంటాడు. ధనిక కుటుంబానికి చెందిన వన్య ఓ వేశ్యను పెళ్లి చేసుకోవడంతో పెద్ద వివాదం చెలరేగుతుంది.
Details
రూ.358 కోట్ల వసూలు
ఈ విషయాన్ని వన్య తల్లిదండ్రులు తెలుసుకుని, తమ కుమారుడు అమాయకుడని భావిస్తూ, అనిపై ఆరోపణలు చేస్తారు.
ఆమెను వన్యను వదిలేయాలని ఒత్తిడి చేస్తూ $10,000 ఆఫర్ చేస్తారు.
కానీ, అని ఆ డబ్బును తీసుకుని వెళ్ళిపోయిందా? లేక ప్రేమ కోసం పోరాడిందా? అనేదే మిగిలిన కథ.
గతేడాది అక్టోబరులో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం 6 మిలియన్ డాలర్ల (సుమారు రూ.52 కోట్లు) బడ్జెట్‌తో తెరకెక్కి, 41 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.358 కోట్లు) వసూళ్లు రాబట్టి రికార్డులు సృష్టించింది.
Details
సాధించిన అవార్డులివే
'అనోరా' విడుదలకు ముందే పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో అవార్డులు అందుకుంది. ముఖ్యంగా, కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో ప్రదర్శించగా, విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రతిష్టాత్మక 'పామ్ డి ఓర్' అవార్డును అందుకుంది.
ఇదే కాకుండా నేషనల్ బోర్డ్ ఆఫ్ రివ్యూ రూపొందించిన టాప్ 10 బెస్ట్ మూవీస్ 2024 జాబితాలో చోటు దక్కించుకుంది.
బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్ (BAFTA) నుంచి రెండు అవార్డులు గెలుచుకుంది.
2025 ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ స్క్రీన్‌ప్లే, ఉత్తమ ఎడిటింగ్ విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకుంది.
ఎక్కడ వీక్షించొచ్చు?
ప్రస్తుతం 'అనోరా' అమెజాన్ ప్రైమ్ వీడియో, యాపిల్ టీవీ+లో స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంది.