
Kalabhavan Nawas: చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. హోటల్ గదిలో ప్రముఖ నటుడు మృతి!
ఈ వార్తాకథనం ఏంటి
ఇటీవల కాలంలో సినీ పరిశ్రమను వరుస విషాదాలు కమ్మేస్తున్నాయి. ఒక ప్రముఖుడి మృతిని మర్చిపోకముందే మరొకరు ప్రాణాలు కోల్పోవడం చిత్రపరిశ్రమలో తీవ్ర దిగ్భ్రాంతి చెందుతోంది. కోట శ్రీనివాసరావు, సరోజా దేవి, ఫిష్ వెంకట్ వంటి ప్రముఖులు ఇటీవల కన్నుమూశారు. తాజాగా మలయాళ చిత్రసీమలో మరో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు, మిమిక్రీ కళాకారుడు కళాభవన్ నవాస్ (వయసు 51) శుక్రవారం సాయంత్రం కేరళలోని చొట్టనిక్కర ప్రాంతంలోని ఓ హోటల్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సినిమా షూటింగ్ నిమిత్తం ఆయన అక్కడ బస చేస్తుండగా, నిర్ణీత సమయానికి చెక్‌ఔట్ చేయకపోవడంతో హోటల్ సిబ్బంది గదికి వెళ్లారు.
Details
పలువురు ప్రముఖుల సంతాపం
నవాస్ అపస్మారక స్థితిలో కనిపించడంతో తక్షణమే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు. పోలీసుల ప్రాథమిక అంచనా ప్రకారం, గుండెపోటు వల్లే మృతి జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. మరణానికి గల ఖచ్చిత కారణం తెలిసేందుకు శనివారం కలమస్సేరి ప్రభుత్వ వైద్య కళాశాలలో పోస్ట్‌మార్టం నిర్వహించనున్నారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. ఈ వార్తతో మలయాళ సినీ పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. నవాస్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.