The Accidental Prime minister: 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్'.. మన్మోహన్ సింగ్ పాత్రను ఎందుకు తిరస్కరించానంటే: అనుపమ్ ఖేర్
భారత మాజీ ప్రధానమంత్రి, దేశ ఆర్థిక సంస్కరణల రూపకర్త మన్మోహన్ సింగ్ (92) మృతిచెందారు. వయోభారంతో ఉత్పన్నమైన అనారోగ్య సమస్యల కారణంగా ఆయన గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఈ విషాద వార్తతో ఆయన్ను గుర్తు చేసుకుంటూ పలువురు సినీ ప్రముఖులు ఎక్స్ వేదికగా స్పందించారు. మన్మోహన్ సింగ్ జీవితం ఆధారంగా రూపొందించిన 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్' చిత్రాన్ని బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ గుర్తుచేశారు. ఆ చిత్రంలో మన్మోహన్ పాత్ర చేయడానికి మొదట అంగీకరించకూడదని భావించినట్లు ఆయన తెలిపారు.
నీలం తలపాగా ధరించిన మన్మోహన్‌ను మిస్ అవుతాం
అనుపమ్ ఖేర్ మాట్లాడుతూ,"మన్మోహన్ సింగ్ ఎంతో తెలివైన వ్యక్తి, మృదుస్వభావి.ఆయన్ని రెండు సార్లు కలిసే అవకాశం నాకు లభించింది.ఆయన నిజాయతీ పరుడు,గొప్ప నాయకుడు.'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్'చిత్రబృందం నన్ను సంప్రదించినప్పుడు మొదట నేను నో చెప్పాలనుకున్నా.కొన్ని రాజకీయ ఒత్తిడుల కారణంగా ఆ పాత్రను రిజెక్ట్ చేయాలని భావించాను. అయితే అలాంటి గొప్ప వ్యక్తి జీవితం ఆధారంగా నటించే అవకాశం అందరికీ రాదని అంగీకరించాను. నా నటజీవితంలో చేసిన గొప్ప చిత్రాల్లో ఇదీ ఒకటి. మన్మోహన్ పాత్ర పోషించినప్పుడు ఆయన వ్యక్తిత్వంలోని కొన్ని మంచి లక్షణాలను నేర్చుకున్నాను.ముఖ్యంగా ఇతరులను శ్రద్ధగా వినడం.ఆ నీలం తలపాగా ధరించిన మన్మోహన్‌ను మేము అందరం మిస్ అవుతాం.ఆచిత్రం వివాదాస్పదం కావొచ్చు కానీ ఆయన మాత్రం వివాదరహితుడే"అని భావోద్వేగంగా చెప్పారు.
సినీ ప్రముఖుల సంతాపం
అనుపమ్ ఖేర్ 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్' సినిమా పోస్టర్‌ను పంచుకుంటూ, మన్మోహన్ సింగ్ మరణం తనను చాలా బాధించినట్లు తెలిపారు. ఆ చిత్రానికి సిద్ధమవుతున్నప్పుడు ఆయన గురించి తెలుసుకుంటే, ఆయనతో సమయం గడిపినట్లు అనిపించిందని పేర్కొన్నారు. అలాగే ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మన్మోహన్ సింగ్ మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. అగ్ర కథానాయకుడు చిరంజీవి, "ఆయన మరణం దేశానికి తీరని లోటు. ఆయన హయాంలో పార్లమెంట్ సభ్యుడిగా, పర్యాటక శాఖ సహాయమంత్రిగా పనిచేయడం నాకు గౌరవకరం" అని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్, "మన్మోహన్ సింగ్ వారసత్వం తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తున్నాను" అని తన సందేశం వెల్లడించారు.