AR Rahman: వివాహ బంధానికి స్వస్తి పలికిన ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్
ఆస్కార్ అవార్డు విజేత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ (AR Rahman) ఆయన భార్య సైరా బాను తమ వివాహ బంధానికి స్వస్తి చెప్పినట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని పరస్పర అంగీకారంతో నిర్ణయించుకున్నట్లు, వారి తరఫున ప్రముఖ లాయర్ వందనా షా ఒక ప్రకటనలో తెలిపారు. ''చిరకాలంగా కొనసాగిన తమ వివాహ బంధానికి ముగింపు పలుకుతూ, విడాకులు తీసుకునేందుకు రెహమాన్, సైరా బాను నిర్ణయం తీసుకున్నారు. గడచిన కాలంలో వారి బంధంలో భావోద్వేగపూరిత ఒత్తిడులు పెరిగి, ఈ నిర్ణయానికి దారితీశాయి. ఒకరిపై ఒకరికి ప్రగాఢమైన ప్రేమ ఉన్నప్పటికీ, అనేక ఇబ్బందులు వారి మధ్య అధిగమించలేని దూరాన్ని సృష్టించాయి'' అని లాయర్ వందనా షా వివరించారు.
తల్లి నిర్ణయంతోనే వివాహం
రెహమాన్, సైరా బాను దాంపత్య జీవితం 29 సంవత్సరాలుగా కొనసాగింది. 1995లో వీరి వివాహం జరిగింది. వీరికి ఖతీజా, రహీమా, అమీన్ అనే ముగ్గురు సంతానం ఉన్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో రెహమాన్, తన తల్లి నిర్ణయంతోనే ఈ వివాహం జరిగినట్లు తెలిపారు. ''సినిమా పనుల్లో బిజీగా ఉండే నాకు 29 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన వచ్చింది. అమ్మకు చెప్పి అమ్మాయిని చూడమని కోరా'' అని ఆయన పేర్కొన్న ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
ఎక్స్ వేదికగా స్పందించిన ఏఆర్ రెహమాన్
విడాకుల విషయంపై స్పందిస్తూ, ఏఆర్ రెహమాన్ ఎక్స్ వేదికలో తన భావాలను పంచుకున్నారు. ''మా వైవాహిక బంధం త్వరలోనే 30 ఏళ్లకు చేరుతుందని ఆనందించేవాళ్లం. కానీ అనుకోని కారణాలతో దీనికి ముగింపు పలకాల్సి వచ్చింది. విరిగిన హృదయాలు దేవుడిని సైతం ప్రభావితం చేస్తాయని నమ్ముతున్నాం. పగిలిన ముక్కలు మళ్లీ ఒకటిగా కలవలేకపోయినా, మా జీవితాల్లో అర్థాన్ని వెతుక్కుంటాము. ఇలాంటి సమయంలో మా వ్యక్తిగత గోప్యతను గౌరవిస్తారని స్నేహితులపై నమ్మకముంది'' అని పేర్కొన్నారు.