ఇప్పుడంతా ఉత్తమ గుండా, ఉత్తమ రౌడీ అవార్డుల సీజన్ నడుస్తుందని కామెంట్లు చేసిన నిర్మాత అశ్వనీదత్
సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు (మే 31) సందర్భంగా మోసగాళ్లకు మోసగాడు చిత్రాన్ని రీ రిలీజ్ చేయాలని ప్లాన్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో నిర్మాత ఆదిశేషగిరి రావు, అశ్వనీదత్, తమ్మారెడ్డి భరధ్వాజ పాల్గొన్నారు. అయితే గతకొన్ని రోజులుగా తెలుగు సినిమాలకు రాష్ట్రస్థాయి అవార్డులు ఇవ్వడం లేదు. ఈ విషయమై నిర్మాతలను ప్రశ్న వేయగా, అశ్వనీదత్ స్పందిస్తూ, ఇప్పుడంతా ఉత్తమ గూండా, ఉత్తమ రౌడీ అవార్డుల సీజన్ నడుస్తోందని, మరలా సినిమా అవార్డుల సీజన్ రావడానికి రెండు మూడేళ్ళు పడుతుందని అన్నారు. ప్రస్తుతం అశ్వనీదత్ మాటలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి అశ్వనీదత్ మాట్లాడారని కొందరు కామెంట్లు చేస్తున్నారు.
జాడ లేని నంది అవార్డుల ప్రధానోత్సవం
ఆంధ్రప్రదేశ్ విడిపోయి తెలంగాన ఏర్పడినప్పటి నుండి నంది అవార్డుల ఊసు లేకుండా పోయింది. గతంలో ఒకసా చంద్రబాబు హయాంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, నంది అవార్డులను ప్రకటించింది. కానీ ఆ అవార్డులు వివాదాస్పదం అయ్యాయి. ఆ తర్వాత మళ్ళీ నంది అవార్డుల జాడ లేదు. ఇటు తెలంగాన ప్రభుత్వం కానీ, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ నంది అవార్డులపై ఎలాంటి మాట మాట్లాడలేదు. ప్రభుత్వం తరపున అవార్డు ఉంటే బాగుంటుందని గతంలో చాలామంది కామెంట్లు చేసారు. మరి నిజంగానే నిర్మాత అశ్వనీదత్ అన్నట్టుగా రెండు మూడేళ్ల తర్వాత నంది అవార్డులు పూర్వ వైభవాన్ని తెచ్చుకుంటాయేమో చూడాలి.