ఆదిపురుష్ సినిమాను బ్యాన్ చేయాలంటున్న అయోధ్య సాధువులు
ప్రభాస్ రాముడిగా, క్రితిసనన్ సీతగా నటించిన ఆదిపురుష్ చిత్రంపై వరుసగా వివాదాలు చెలరేగుతున్నాయి. నిన్నటికి నిన్న నేపాల్ లోని ఖాట్మాండు, పోఖారా ప్రాంతాల్లో ఆదిపురుష్ చిత్రాన్ని నిలిపివేసారు. అంతేకాదు, అన్ని హిందీ సినిమాలపై నిషేధాన్ని విధించారు. ఆదిపురుష్ చిత్రంలో డైలాగులు సరిగ్గా లేవని, సీత పుట్టింది భారతదేశంలో అని చూపించారని, నిజానికి నేపాల్ లో జనక్ పూర్ లో సీత పుట్టిందని తెలియజేస్తూ ఆదిపురుష్ చిత్రంపై నిషేధం విధించారు. తాజాగా ఆదిపురుష్ లోని డైలాగులపై అయోధ్య సాధువులు మండిపడుతున్నారు. ఆదిపురుష్ లోని పాత్రల వేషం, మాట్లాడే భాష.. రామాయణాన్ని వక్రీకరించినట్టుగా ఉన్నాయని, ఆదిపురుష్ చిత్రాన్ని బ్యాన్ చేయాలని అయోధ్య రామాలయం ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్ అన్నారు.
ఆదిపురుష్ సినిమాపై కురుస్తున్న కలెక్షన్ల వర్షం
హనుమాన్ గర్హి ఆలయ పూజారి రాజు దాస్ సైతం ఆదిపురుష్ చిత్ర ప్రదర్శనను వెంటనే ఆపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. హిందూ దేవుళ్ళను వక్రీకరించినట్టుగా ఆదిపురుష్ చిత్రాన్ని తెరకెక్కించారని రాజు దాస్ కామెంట్స్ చేస్తున్నారు. వరుసగా వస్తున్న వివాదాలకు ఆదిపురుష్ బృందం ఎలాంటి స్పందన తెలియజేయనుందో ఇంట్రెస్టింగ్ గా మారింది. వివాదాలను పక్కన పెడితే ఆదిపురుష్ చిత్రానికి కలెక్షన్లు బాగా వస్తున్నాయి. రిలీజైన మూడురోజుల్లో 340కోట్ల గ్రాస్ సాధించినట్లు సమాచారం. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను టీ సిరీస్, రెట్రో ఫైల్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమాలో లక్ష్మణుడిగా సన్నీసింగ్, హనుమంతుడిగా దేవ్ దత్త నాగి, రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్ నటించారు.