
Upasana: దిల్లీ ముఖ్యమంత్రితో బతుకమ్మ ఆడిన ఉపాసన
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ సంస్కృతి, ఆచారాలు, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పండగ 'బతుకమ్మ'ను తెలంగాణ వాసులు ప్రతి సంవత్సరం అట్టహాసంగా జరుపుకుంటారు. సామాన్యులతో పాటు వివిధ రంగాల సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు కూడా ఈ వేడుకల్లో పాల్గొని ఉత్సాహంగా పాటలు, నాట్యాలు చేస్తారు. ఇలాంటి ఉత్సాహం దేశ రాజధాని దిల్లీలోనూ కనిపించింది. దిల్లీలోని ఒక ప్రముఖ కాలేజీలో తెలుగు విద్యార్థులు ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకలో దిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా, రామ్ చరణ్ సతీమణి ఉపాసన ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వారు విద్యార్థులతో కలిసి బతుకమ్మను నెత్తి ఎత్తి పాటలు పాడి సరదాగా సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Details
ఈ సంప్రదాయం సాంస్కృతిక ఐక్యతకు చిహ్నం
రేఖా గుప్తా తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 'ఇది కేవలం పూల ఉత్సవం మాత్రమే కాదు. మాతృత్వం, జీవనం, ప్రకృతి పట్ల గల గౌరవానికి ఇది ప్రతీక. తెలంగాణ మహిళలు తరతరాలుగా కొనసాగిస్తున్న ఈ సంప్రదాయం సాంస్కృతిక ఐక్యతకు చిహ్నం. ఢిల్లీలో ఉన్న తెలుగు విద్యార్థులు ఇలాంటి వేడుకలు నిర్వహించడం రాష్ట్రాల మధ్య సాంస్కృతిక బంధాన్ని బలపరుస్తుందని తెలిపారు. అలాగే ఉపాసన కొణిదెల రీ-ట్వీట్ చేస్తూ, తెలంగాణ సంస్కృతిని గౌరవిస్తూ తమతో బతుకమ్మ వేడుకలను జరుపుకున్నందుకు ముఖ్యమంత్రి రేఖా గుప్తాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం రేఖా గుప్తా మరియు ఉపాసన బతుకమ్మ వేడుకలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.