Loading...
Batman's Iconic Batpod Bike: బ్యాట్‌మ్యాన్ బైక్ మీ సొంతం కావాలా? అయితే రూ.10 కోట్లకు పైగా ఖర్చు చేయాల్సిందే!
అయితే రూ.10 కోట్లకు పైగా ఖర్చు చేయాల్సిందే!

Batman's Iconic Batpod Bike: బ్యాట్‌మ్యాన్ బైక్ మీ సొంతం కావాలా? అయితే రూ.10 కోట్లకు పైగా ఖర్చు చేయాల్సిందే!

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 06, 2026
03:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

హాలీవుడ్‌ సూపర్‌హిట్‌ సినిమాల్లో బ్యాట్‌మ్యాన్ ఉపయోగించిన ప్రత్యేక బైక్‌ 'బ్యాట్‌పాడ్‌' (Batpod) వేలానికి సిద్ధమైంది. ఈ బైక్‌ను సొంతం చేసుకోవాలంటే ఏకంగా 1.2 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.10.6 కోట్లు) ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రముఖ వేలం సంస్థ ప్రాప్‌స్టోర్‌ ఆక్షన్‌ (Propstore Auction) ఆధ్వర్యంలో సినిమా జ్ఞాపికల వేలంలో భాగంగా దీనిని విక్రయించనున్నారు. క్రిస్టోఫర్‌ నోలన్‌ దర్శకత్వంలో వచ్చిన 'ది డార్క్‌ నైట్‌' (2008), 'ది డార్క్‌ నైట్‌ రైజెస్‌' (2012) సినిమాల్లో క్రిస్టియన్‌ బేల్‌ బ్యాట్‌మ్యాన్‌గా నటించిన విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాల్లోనూ ఈ బైక్‌ను ఉపయోగించారు. ప్రాప్‌స్టోర్‌ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ స్టీఫెన్‌ లేన్‌ ఈ బైక్‌ను అద్భుతమైన వాహనంగా అభివర్ణించారు.

వివరాలు 

నోలన్‌ ఆలోచనకు రూపం.. 750 సీసీ ఇంజిన్‌తో భారీ బైక్

దర్శకుడు క్రిస్టోఫర్‌ నోలన్‌,ప్రొడక్షన్‌ డిజైనర్‌ నాథన్‌ క్రౌలీ కలిసి ఈ బైక్‌ రూపకల్పన చేశారు.

అనంతరం ఆస్కార్‌ అవార్డు విజేత,విజువల్‌ ఎఫెక్ట్స్‌ నిపుణుడు క్రిస్‌ కోర్వోల్డ్‌ దీనికి తుది రూపమిచ్చారు.

'ది బీస్ట్‌' (The Beast)అని కూడా పిలిచే ఈ బైక్‌ తయారీ వెనుక ఎంతో సాంకేతిక నైపుణ్యం ఉందని స్టీఫెన్‌ లేన్‌ తెలిపారు.

ఇందులో 750 సీసీ హోండా ఇంజిన్‌, 31 అంగుళాల భారీ టైర్లు ఉన్నాయి.

ఈ బైక్‌పై నటులు కూర్చోవడం, స్టంట్‌ కళాకారులు నడపడం చాలా కష్టంగా ఉండేదని చెప్పారు.

షూటింగ్‌ సమయంలో పలుమార్లు దీనిపై నియంత్రణ కోల్పోయిన ఘటనలు కూడా జరిగాయని వెల్లడించారు.

ఒకసారి బైక్‌ అదుపుతప్పి కెమెరాను ఢీకొట్టిన దృశ్యాలు కూడా వీడియోలో నమోదయ్యాయని వివరించారు.

వివరాలు 

బ్యాట్‌పాడ్‌తో పాటు ఇతర సినిమా వస్తువులకూ వేలం

ఈ బ్యాట్‌పాడ్‌ బైక్‌లు మొత్తం ఆరు తయారు చేయగా.. వాటిలో వార్నర్‌ బ్రదర్స్‌ స్టూడియో వేలం కోసం అధికారికంగా విడుదల చేసినది ఒక్కదానినే అని లేన్‌ తెలిపారు.

ప్రత్యేకమైన రూపం,ఆకర్షణీయమైన డిజైన్‌ కారణంగా ఇలాంటి సినిమా వాహనాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్‌ ఉంటుందని చెప్పారు.

గురువారం నుంచే ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌ ప్రారంభమైంది. డిసెంబర్‌ 4న లండన్‌లో జరిగే ప్రత్యక్ష వేలంతో ఇది ముగియనుంది.

ఈ వేలంలో బ్యాట్‌పాడ్‌తో పాటు వందలాది సినిమా వస్తువులను విక్రయించనున్నారు.

వాటిలో 'బ్యాట్‌మ్యాన్‌ బిగిన్స్‌' (2005)లో క్రిస్టియన్‌ బేల్‌ ధరించిన బ్యాట్‌సూట్‌, 'బ్యాట్‌మ్యాన్‌ ఫరెవర్‌' (1995)లో వాల్‌ కిల్మర్‌ ఉపయోగించిన మరో బ్యాట్‌సూట్‌ కూడా ఉన్నాయి.

ADVERTISEMENT

వివరాలు 

ఇండియానా జోన్స్‌, గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌ వస్తువులూ వేలానికి

'ఇండియానా జోన్స్‌ అండ్‌ ది టెంపుల్‌ ఆఫ్‌ డూమ్‌' (1984), 'ఇండియానా జోన్స్‌ అండ్‌ ది లాస్ట్‌ క్రూసేడ్‌' (1989) సినిమాల్లో స్టంట్‌ కళాకారుడు విక్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ ధరించిన టోపీ, షర్ట్‌తో పాటు 'గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌' సిరీస్‌లో జాన్‌ స్నో పాత్ర ఉపయోగించిన కత్తిని కూడా వేలం వేయనున్నారు.

'ఎల్మ్‌ స్ట్రీట్‌' సినిమాల్లోని ఫ్రెడ్డీ క్రూగర్‌ చేతి తొడుగు కూడా ఈ జాబితాలో ఉంది.

వేలం ప్రారంభమైన కొన్ని గంటల్లోనే దానికి నిర్ణయించిన కనీస ధర 25 వేల పౌండ్లు (సుమారు 34 వేల డాలర్లు) పలికింది.

నవంబర్‌ 19 నుంచి 22 వరకు లండన్‌లోని కంబర్లాండ్‌ హోటల్‌లో 100కు పైగా సినిమా వస్తువులను ప్రదర్శనకు ఉంచనున్నారు.

ADVERTISEMENT