Ilaiyaraaja:కాపీరైట్ హక్కులపై పోరాటం.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఇళయరాజా
ఈ వార్తాకథనం ఏంటి
తాను స్వరపరిచిన ప్రసిద్ధ గీతం 'ఎన్ ఇనియా పొన్ నిలవే'కు సంబంధించిన కాపీరైట్ వివాదంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన సర్వోన్నత న్యాయస్థానంలో స్పెషల్ లీవ్ పిటిషన్ (SLP) దాఖలు చేశారు. 'మూడు పని' చిత్రంలోని 'ఎన్ ఇనియా పొన్ నిలవే' పాటను 'అఘాతీయా' అనే మరో సినిమాలో రీ-యూజ్ చేసేందుకు ప్రయత్నించారు. దీనిపై 'సారెగామా ఇండియా' సంస్థ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఇళయరాజాకు కేవలం పాటలోని సంగీత స్వరకల్పనపై మాత్రమే హక్కు ఉందని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.
వివరాలు
హైకోర్టు తీర్పును సవాలు చేసిన ఇళయరాజా
సౌండ్ రికార్డింగ్, సాహిత్యంపై ఆయనకు ఎలాంటి కాపీరైట్ లేదని పేర్కొంది. సౌండ్ రికార్డింగ్‌కు సంబంధించిన హక్కులు మూల చిత్ర నిర్మాత నుంచి సారెగామా సంస్థకు బదిలీ అయ్యాయని హైకోర్టు తెలిపింది.
అయితే ఈ పాటకు స్వయంగా సంగీతాన్ని సమకూర్చినందున, తాను రూపొందించిన స్వరాలను కొత్త రూపంలో ఉపయోగించేందుకు ఇతరులకు అనుమతి ఇచ్చే పూర్తి హక్కు తనకే ఉంటుందని ఇళయరాజా స్పష్టం చేస్తున్నారు.
సంగీత కూర్పు, సాహిత్యం, సౌండ్ రికార్డింగ్‌లను వేర్వేరు అంశాలుగా విడదీసి, తన హక్కులను కేవలం సంగీత స్వరకల్పనకే పరిమితం చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆయన సవాలు చేశారు.
వివరాలు
త్వరలోనే విచారణ
ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (SLP) దాఖలు చేశారు.
ఇళయరాజా దాఖలు చేసిన ఈ పిటిషన్ త్వరలోనే సుప్రీంకోర్టులో విచారణకు రానుంది.
దీంతో 'ఎన్ ఇనియా పొన్ నిలవే' పాటకు సంబంధించిన కాపీరైట్ హక్కులపై సర్వోన్నత న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.