బిగ్ బాస్ సీజన్ 7 ప్రోమో వచ్చేసింది: స్టైలిష్ లుక్ లో అదరగొడుతున్న నాగార్జున
తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించిన బిగ్ బాస్ రియాల్టీ షో, కొత్త సీజన్ రాబోతుంది. ఇప్పటివరకు ఆరు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుని 7వ సీజన్ లోకి ఎంటర్ కాబోతుంది. బిగ్ బాస్ 7వ సీజన్ హోస్ట్ పై అనేక పుకార్లు వచ్చాయి. వాటన్నింటినీ చెరిపేస్తూ 7వ సీజన్ కి కూడా హోస్ట్ గా నాగార్జున వ్యవహరించనున్నారని ప్రోమోలో తెలియజేసారు. ప్రోమోలో కనిపించిన నాగార్జున చాలా స్టైలిష్ గా ఉన్నారు. చింపిరి జుట్టు, పెరిగిన గడ్డంతో కొత్త లుక్ లో కనిపించారు. ఆరెంజ్ కలర్ చొక్కాలో కలర్ ఫుల్ గా కనిపించారు. ఈసారి బిగ్ బాస్ సీజన్ కొత్తగా ఉండబోతుందని చెప్పబోయిన నాగార్జున ఆగిపోయి, ప్రతీసారీ ఇలాగే చెప్తాం కదా అని తడబడతారు.
గాల్లో లేచిన వస్తువులు
ఏం చెప్పాలా అని ఆలోచిస్తూ కుడి ఎడమైతే అని పాట పాడతాడు. దాంతో ఆ రూమ్ లో ఉన్న వస్తువులన్నీ గాల్లోకి లేస్తాయి. దాన్నిబట్టి బిగ్ బాస్ సీజన్ 7ని మునుపటి కంటే కొత్తగా డిజైన్ చేసారని తెలుస్తోంది. ప్రోమో రిలీజ్ చేసారు కానీ, ఈ సీజన్ ఎప్పటి నుండి మొదలవుతుందనేది వెల్లడి చేయలేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం, సెప్టెంబరులో బిగ్ బాస్ సీజన్ 7 మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మరి ఈ సీజన్ లో ఎంతమంది కంటెస్టెంట్స్ ఉంటారో, ఎవరెవరు వస్తారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. స్టార్ మా ఎవరెవరిని తీసుకోస్తుందో చూడాలి.