Bigg boss 7: బిగ్‌బాస్-7 వివాదం.. నటిపై కంటెస్టెంట్ అభిమానుల దాడి
'బిగ్ బాస్' షోను కొందరు వినోదం కోసం కాకుండా పర్సనల్‌గా తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే వ్యక్తిగత దాడులకు దిగుతున్న సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా తమిళ నటి వనిత విజయకుమార్‌పై దాడి జరిగింది. తమిళ బిగ్ బాస్ కంటెస్టెంట్ ప్రదీప్ ఆంటోనీ అభిమానులు దాడి చేయడం సంచలనం సృష్టించింది. ఈ మేరకు తనపై దాడి జరిగినట్లు నటి వనితా విజయకుమార్ సోషల్ మీడియా వేదికగా చెప్పింది. తెలుగులో మాదిరిగానే తమిళంలో కూడా బిగ్ బాస్ -7 సీజన్ నడుస్తోంది. బిగ్ బాస్‌లో ప్రదీప్ ఆంటోనీని రెడ్ కార్డ్ ద్వారా హోస్ట్ కమల్ హాసన్ ఎలిమినేట్ చేశారు. ఈ వ్యవహారం సంచనలంగా మారింది.
బిగ్ బాస్ హౌస్‌లో వనిత కూతురు జోవిక
తమిళ బిగ్ బాస్ -7 సీజన్‌లో వనిత విజయకుమార్ కూతురు జోవిక కంటెస్టెంట్‌గా ఉన్నారు. ఈ క్రమంలో తన కూతురుకు సపోర్టుగా వనిత విజయకుమార్ తన యూట్యూబ్ ఛానెల్‌లో రివ్యూలు చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రదీప్ ఆంటోనీని వైల్డ్ కార్డు ద్వారా తిరిగి బిగ్ బాస్ హౌస్‌లోకి తీసుకొస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై వనిత విజయకుమార్ వ్యతిరేకించారు. ప్రదీప్‌కు వ్యతిరేకంగా వనిత వ్యాఖ్యలపై చేయడంపై ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో శనివారం రాత్రి ఆమెపై దాడి చేసారు.