Pratyusha : దివంగత నటి ప్రత్యూష జీవితకథపై బయోపిక్.. ప్రధాన పాత్రలో రష్మిక మందాన్న!
ఈ వార్తాకథనం ఏంటి
నేషనల్ క్రష్‌గా దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన్న, ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్‌లలో అత్యంత డిమాండ్ ఉన్న నటిగా ఎదిగింది. వరుస విజయాలతో 2025లో విడుదలైన ఐదు చిత్రాల్లో ఎక్కువ సినిమాలు సూపర్‌హిట్స్ సాధించడంతో ఆమె మార్కెట్, క్రేజ్ మరింత పెరిగాయి. కమర్షియల్ సినిమాలతో పాటు కథా ప్రాధాన్యమైన స్క్రిప్ట్‌లను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్న రష్మిక, 2026లోనూ పలు భారీ ప్రాజెక్టులతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. దర్శకుడు వెంకీ కుడుముల రాబోయే చిత్రంలో రష్మిక హీరోయిన్‌గా నటించబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'భీష్మ' భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. అందుకే ఈ కాంబినేషన్‌పై మళ్లీ భారీ బజ్ నెలకొంది.
Details
ఇప్పటివరకూ అధికారిక ప్రకటన వెలువడలేదు
తాజా సమాచారం మేరకు వెంకీ కుడుముల దర్శకత్వం వహించే ఈ కొత్త సినిమా ఒక బయోపిక్ అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఈ బయోపిక్, తెలుగు సినీ పరిశ్రమకు చెందిన దివంగత నటి ప్రత్యూష జీవిత కథ ఆధారంగా ఉంటుందనే వార్తలు మరింత ఆసక్తి రేపుతున్నాయి. రష్మిక ఇప్పటికే కథ విన్నారని, ఈ ప్రాజెక్ట్‌కు దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే సమాచారం ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతోంది. అయితే చిత్రబృందం నుండి ఇప్పటికి ఏ అధికారిక ప్రకటన వెలువడలేదు. స్టార్ స్టార్‌డమ్ మధ్యలోనే ఇలాంటి భావోద్వేగభరిత బయోపిక్ చేయడం రష్మిక కెరీర్‌లో మైలురాయి అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Details
చిన్న వయస్సులోనే తండ్రి కోల్పోయిన ప్రత్యూష
తెలంగాణలోని భువనగిరిలో జన్మించిన ప్రత్యూష చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయింది. ఆమె తల్లి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు. చిన్నప్పటి నుంచే మోడలింగ్‌లో రాణించిన ప్రత్యూష 'ఉత్తమ స్మైల్' అవార్డును అందుకుంది. కేవలం 17 ఏళ్లకే తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆమె, 1998 నుంచి 2002 వరకు తెలుగు-తమిళ చిత్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే 2002 ఫిబ్రవరి 23న, 20 ఏళ్ల వయసులో ప్రత్యూష అకాల మరణం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.