Loading...
Riteish Deshmukh: టాలీవుడ్‌లోకి బాలీవుడ్ స్టార్ రితేశ్ దేశ్‌ముఖ్.. రామ్ పోతినేనితో భారీ ప్రాజెక్ట్!

Riteish Deshmukh: టాలీవుడ్‌లోకి బాలీవుడ్ స్టార్ రితేశ్ దేశ్‌ముఖ్.. రామ్ పోతినేనితో భారీ ప్రాజెక్ట్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 19, 2026
01:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని అనూహ్యమైన సర్‌ప్రైజ్ ఇచ్చారు. తన ఎనర్జిటిక్ డ్యాన్సులు, నటనతో వెండితెరపై ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రామ్.. ఇప్పుడు మెగాఫోన్ కూడా పట్టారు. తన ప్రతిష్ఠాత్మక 23వ చిత్రం #RAPO23 కోసం హీరోగా నటించడంతో పాటు దర్శకత్వ బాధ్యతలను కూడా చేపట్టారు. దీంతో ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. తన తొలి దర్శకత్వ ప్రయత్నంలోనే రామ్ 'నియో-నాయర్ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్'ను ఎంచుకున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ విలక్షణ నటుడు రితేశ్ దేశ్‌ముఖ్ నటిస్తుండటం మరో ప్రత్యేకత. ఈ చిత్రంతో ఆయన తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు.

వివరాలు

వీడియోను రిలీజ్ చేసిన చిత్రబృందం

'ఏక్ విలన్', 'రైడ్ 2', బ్లాక్‌బస్టర్ 'రాజా శివాజీ' వంటి చిత్రాల్లో తనదైన నటనతో బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న రితేశ్ దేశ్‌ముఖ్.. రామ్ చెప్పిన కథ, తన పాత్ర తీరును వినగానే ఒక్క సమావేశంలోనే సినిమా చేసేందుకు అంగీకరించినట్లు సమాచారం.

తాజాగా హైదరాబాద్‌లో జరుగుతున్న భారీ షెడ్యూల్‌లో ఆయన చిత్రీకరణలో పాల్గొన్నారు.

రితేశ్ సెట్స్‌లోకి అడుగుపెట్టగానే దర్శకుడు, హీరో రామ్ పోతినేని ఆయనను ఆత్మీయంగా హత్తుకున్న వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది.

ఈ తెరవెనుక దృశ్యాలు (బీటీఎస్) ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు మరింత పెరిగాయి.

వివరాలు

భారీ బడ్జెట్‌తో #RAPO23.. నిర్మాణంలో రాజీ లేని నిర్మాత

రాపో సినిమాటిక్స్ బ్యానర్‌పై నిర్మాత కృష్ణ పోతినేని ఈ చిత్రాన్ని అత్యంత భారీ వ్యయంతో తెరకెక్కిస్తున్నారు.

నిర్మాణ విలువల విషయంలో ఎలాంటి రాజీ పడకుండా సినిమాను రూపొందిస్తున్నట్లు సమాచారం.

రామ్ పోతినేని మార్క్ యాక్షన్‌తో పాటు ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించే మైండ్ గేమ్స్ కూడా ఇందులో ఉండనున్నాయని తెలుస్తోంది.

ఇక టాలీవుడ్‌లో గోల్డెన్ లెగ్‌గా, లక్కీ ఛార్మ్‌గా గుర్తింపు తెచ్చుకున్న సంయుక్త ఈ సినిమాలో కథానాయికగా నటిస్తున్నారు. ఆమె రాకతో ప్రాజెక్ట్‌కు మరింత గ్లామర్ తోడైంది.

ADVERTISEMENT

వివరాలు

పాన్ ఇండియా టెక్నీషియన్లతో రామ్ తొలి దర్శకత్వ చిత్రం

దర్శకుడిగా తొలి అడుగులోనే రామ్ పోతినేని ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులను రంగంలోకి దించారు.

జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ తిరునవుక్కరసు (తిరు) ఈ చిత్రానికి ఛాయాగ్రహణం అందిస్తున్నారు.

'ఖైదీ' ఫేమ్ సంగీత దర్శకుడు సామ్ సీఎస్ తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ఉత్కంఠను పెంచేందుకు సిద్ధమవుతున్నారు. యాక్షన్ సన్నివేశాలను హాలీవుడ్ స్థాయిలో రూపొందించేందుకు ముగ్గురు యాక్షన్ డైరెక్టర్లు పనిచేస్తున్నారు.

పీటర్ హెయిన్, విక్రమ్ మోర్, కెవిన్ ఈ చిత్రంలోని యాక్షన్ సన్నివేశాలను డిజైన్ చేస్తున్నారు. దీంతో సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ADVERTISEMENT

వివరాలు

అభిమానుల్లో పెరిగిన ఆసక్తి

మొత్తానికి హీరోగా దర్శకుడిగా రామ్ పోతినేని ద్విపాత్రాభినయం చేస్తుండటం.. ఆయనకు జోడీగా సంయుక్త నటిస్తుండటం.. మరోవైపు రితేశ్ దేశ్‌ముఖ్ వంటి బాలీవుడ్ నటుడు తెలుగు చిత్రంలో అడుగుపెడుతుండటం #RAPO23పై ఆసక్తిని పెంచుతున్నాయి.

యాక్షన్, సైకలాజికల్ మైండ్ గేమ్స్, బలమైన సాంకేతిక బృందంతో తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.

ADVERTISEMENT