Project Hail Mary: బాక్సాఫీస్ రికార్డు షేక్.. 10 రోజుల్లోనే 2500 కోట్లు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికుల నోట వినిపిస్తున్న పేరు ప్రాజెక్ట్ హేల్ మేరీ. హాలీవుడ్ స్టార్ ర్యాన్ గోస్లింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ బాక్సాఫీస్ వద్ద సంచలన రికార్డులు సృష్టిస్తోంది. విడుదలైన కేవలం పది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 2500 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. భారతదేశంలో కూడా ఈ స్పేస్ అడ్వెంచర్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. మార్చి 26న విడుదలైన ఈ చిత్రం, నాలుగు రోజుల లాంగ్ వీకెండ్‌లోనే దేశంలో ₹17.28 కోట్ల వసూళ్లు సాధించి తన సత్తా చాటింది. ముఖ్యంగా మెట్రో నగరాల్లో IMAX, 4DX స్క్రీన్లకు భారీ డిమాండ్ నెలకొంది.
వివరాలు
క్షణాల్లో అమ్ముడైపోయిన టికెట్లు
తెల్లవారుజామున 3:45 గంటలకే షోలు ఏర్పాటు చేసినా టికెట్లు క్షణాల్లో అమ్ముడైపోతున్నాయి. గతంలో భారతదేశంలో భారీ వసూళ్లు సాధించిన హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ చిత్రాల రికార్డులను ఈ సినిమా బద్దలు కొడుతోంది. ఇంటర్స్టెల్లార్ కంటే 53% ఎక్కువ వసూళ్లు సాధించగా, డ్యూన్: రెండవ భాగంతో పోలిస్తే 35% ముందంజలో ఉంది. మార్టిన్ కంటే ఏకంగా 89% ఎక్కువ వసూళ్లు నమోదు చేసింది. 2025లో విడుదలైన అవతార్: ఫైర్ అండ్ యాష్ తర్వాత భారత బాక్సాఫీస్‌ను కుదిపేస్తున్న విదేశీ చిత్రం ఇదే కావడం విశేషం. ఫిల్ లార్డ్, క్రిస్టోఫర్ మిల్లర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రేల్యాండ్ గ్రేస్ అనే వ్యోమగామి పాత్రలో ర్యాన్ గాస్లింగ్ అద్భుత నటన కనబరిచారు.