LOADING...
Catherine Tresa: మరోసారి ఐటమ్ భామగా కేథరిన్ థెరిస్సా.. సందీప్ కిషన్ మూవీలో స్పెషల్ సాంగ్
మరోసారి ఐటమ్ భామగా కేథరిన్ థెరిస్సా.. సందీప్ కిషన్ మూవీలో స్పెషల్ సాంగ్

Catherine Tresa: మరోసారి ఐటమ్ భామగా కేథరిన్ థెరిస్సా.. సందీప్ కిషన్ మూవీలో స్పెషల్ సాంగ్

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 05, 2025
10:37 am

ఈ వార్తాకథనం ఏంటి

కేవలం అందం ఉంటే సరిపోదు... అందుకు తోడు అదృష్టం కూడా అవసరం అనే మాటను హీరోయిన్ కేథరిన్ థెరిస్సా కెరీర్ స్పష్టంగా చూపిస్తోంది. ఆకట్టుకునే అందం, చక్కని నటన ఉన్నప్పటికీ ఆమెకు రావాల్సిన స్థాయి క్రేజ్ మాత్రం ఇప్పటివరకు దక్కలేదనే అభిప్రాయం ఉంది. పెద్ద హీరోల సినిమా అవకాశాలు వచ్చినా ఎక్కువగా రెండో హీరోయిన్ పాత్రలకే పరిమితమవ్వడంతో స్టార్ హీరోయిన్ స్థాయి వరకు ఎదగలేకపోయారు. సుమారు 15 ఏళ్లుగా సినీ ప్రస్థానం కొనసాగుతున్నప్పటికీ 'ఇద్దరమ్మాయిలతో', 'సరైనోడు', 'బింబిసార' వంటి కొద్ది సినిమాలే చెప్పుకోదగ్గ విజయాలుగా నిలిచాయి. ఇటీవల 'వాల్తేరు వీరయ్య' సినిమాలో మెరిపించినా... అందులో కూడా రెండు మూడు సీన్ల వరకే ఆమె పాత్ర కనిపించింది.

వివరాలు 

ఈ ఏడాది తమిళంలో 'గ్యాంగర్స్' సినిమాలో నటించిన నటి 

ప్రస్తుతం కేథరిన్ అరకొర అవకాశాలతోనే కెరీర్‌ను ముందుకు నడిపిస్తున్నారు. ఈ ఏడాది తమిళంలో విడుదలైన 'గ్యాంగర్స్' సినిమాలో నటించి సరిపెట్టుకున్నారు. తెలుగులో త్వరలో 'మన శంకర్ వరప్రసాద్ గారు' సినిమాలో కనిపించబోతున్నారు. అయితే అందులో నయనతార లీడ్ రోల్ కావడంతో మిగతా పాత్రలన్నీ సహాయకత స్థాయిలోనే ఉండనున్నాయి. ఇదిలా ఉండగా, తెలుగులో 'ఫని' అనే సినిమాలో కూడా ఆమె నటిస్తున్నారు కానీ, ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటివరకు పెద్దగా ప్రచారం లేదా అప్‌డేట్స్ లేవు. అయితే కేథరిన్ ఓ స్పెషల్ ఐటమ్ సాంగ్ చేయడానికి అంగీకరించారనే వార్త చక్కర్లు కొడుతోంది. జాసన్ సంజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'సిగ్మా' సినిమాలో ఆమె పెప్ సాంగ్‌లో డ్యాన్స్ చేయనున్నారట.

వివరాలు 

'సిగ్మా' చిత్రంలోని పెప్ సాంగ్

ఇందులో హీరో సందీప్ కిషన్‌తో కలిసి స్టెప్పులు వేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ఐటమ్ సాంగ్ చేయడం కేథరిన్‌కు కొత్త కాదు. ఇంతకుముందు 'జయ జానకి నాయక'లో ఆమె స్పెషల్ సాంగ్‌లో మెరిసారు. అలాగే ఈ ఏడాది తనే హీరోయిన్‌గా నటించిన 'గ్యాంగర్స్' మూవీలో ఒక పాటకు ఊర మాస్ స్టెప్పులతో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం చాలామంది హీరోయిన్లు స్పెషల్ సాంగ్స్ ద్వారా మళ్లీ అవకాశాలు దక్కించుకుంటుండటంతో, ఆలస్యంగానైనా ఈ ట్రెండ్‌ను ఆమె గుర్తించినట్టుంది. అందుకే 'సిగ్మా' చిత్రంలోని పెప్ సాంగ్‌కు వెంటనే ఒప్పుకున్నారని సమాచారం. కనీసం ఈ పాట అయినా ఆమె కెరీర్‌కు కొత్త ఆఫర్ల తలుపులు తెరుస్తుందేమో చూడాలి.

Advertisement