LOADING...
Celina jaitly: సిస్టర్ నివేదిత జీవితకథతో మళ్లీ తెరపైకి సెలీనా జైట్లీ.. 15 ఏళ్ల తర్వాత పూర్తి స్థాయి రీఎంట్రీ
సిస్టర్ నివేదిత జీవితకథతో మళ్లీ తెరపైకి సెలీనా జైట్లీ.. 15 ఏళ్ల తర్వాత పూర్తి స్థాయి రీఎంట్రీ

Celina jaitly: సిస్టర్ నివేదిత జీవితకథతో మళ్లీ తెరపైకి సెలీనా జైట్లీ.. 15 ఏళ్ల తర్వాత పూర్తి స్థాయి రీఎంట్రీ

వ్రాసిన వారు Moogati Shabari
Jul 05, 2026
11:59 am

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ దాదాపు 15 సంవత్సరాల విరామం అనంతరం మరోసారి పూర్తి స్థాయి పాత్రతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఆమె చివరిసారిగా 2011లో విడుదలైన కన్నడ చిత్రం 'శ్రీమతి'లో ఉపేంద్ర సరసన కథానాయికగా నటించారు. ఇప్పుడు స్వామి వివేకానంద శిష్యురాలు సిస్టర్ నివేదిత జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందుతున్న బయోపిక్‌లో ప్రధాన పాత్ర పోషించనున్నారు. జాతీయ అవార్డు గెలుచుకున్న లఘు చిత్రం 'ఏక్ దువా' దర్శకుడు రామ్‌కమల్ ముఖర్జీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ అవకాశంపై స్పందించిన సెలీనా జైట్లీ, స్వామి వివేకానంద ఆలోచనలతో ప్రభావితమై సమాజ సేవకు జీవితాన్ని అంకితం చేసిన సిస్టర్ నివేదిత పాత్రను పోషించడం తనకు గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు.

వివరాలు

సినీ ప్రయాణంలో ఈ చిత్రం ప్రత్యేకం..

తన సినీ ప్రయాణంలో ఈ చిత్రం ప్రత్యేకమైన స్థానం సంపాదిస్తుందని ఆమె పేర్కొన్నారు. చిన్నతనంలోనే తన తల్లి ద్వారా సిస్టర్ నివేదిత సేవా కార్యక్రమాల గురించి తెలుసుకున్నానని, ఇప్పుడు అదే వ్యక్తిత్వాన్ని వెండితెరపై ఆవిష్కరించే అవకాశం రావడం జీవితంలో మరపురాని అనుభూతిగా భావిస్తున్నట్లు చెప్పారు. గత 15 సంవత్సరాలుగా ఐరోపాలో నివసించిన తాను, తన మూలాలను తిరిగి అన్వేషించేందుకు స్వదేశానికి వచ్చానని, సనాతన ధర్మంతో మళ్లీ అనుబంధాన్ని పెంచుకున్నానని సెలీనా వెల్లడించారు.

వివరాలు

సిస్టర్ నివేదిత ఎవరు?

సిస్టర్ నివేదిత అసలు పేరు మార్గరెట్ ఎలిజబెత్ నోబెల్. ఆమె 1867లో ఐర్లాండ్‌లో జన్మించారు. 1895లో స్వామి వివేకానంద బోధనలు ఆమెను ఎంతగానో ఆకట్టుకోవడంతో భారతదేశానికి వచ్చారు. అనంతరం 1898లో స్వామి వివేకానంద శిష్యరికాన్ని స్వీకరించి 'సిస్టర్ నివేదిత' అనే పేరును పొందారు. ఆధ్యాత్మికవేత్తగా, విద్యా సంస్కర్తగా, రచయిత్రిగా ఆమె విశేష సేవలందించి అనేక మందికి స్ఫూర్తిగా నిలిచారు. కేవలం 43 ఏళ్ల వయసులో, 1911లో ఆమె మరణించారు.

Advertisement