LOADING...
Wimbledon: స్వైటెక్‌కు షాక్‌.. రిబకినా కూడా టోర్నీ నుంచి నిష్క్రమణ
స్వైటెక్‌కు షాక్‌.. రిబకినా కూడా టోర్నీ నుంచి నిష్క్రమణ

Wimbledon: స్వైటెక్‌కు షాక్‌.. రిబకినా కూడా టోర్నీ నుంచి నిష్క్రమణ

వ్రాసిన వారు Moogati Shabari
Jul 05, 2026
09:22 am

ఈ వార్తాకథనం ఏంటి

వింబుల్డన్‌ మహిళల సింగిల్స్‌లో మరో భారీ సంచలనం చోటుచేసుకుంది. టైటిల్‌ డిఫెండింగ్‌ ఛాంపియన్‌, మూడో సీడ్‌ ఇగా స్వైటెక్‌ మూడో రౌండ్‌లోనే టోర్నీకి వీడ్కోలు పలికింది. ఫిలిప్పీన్స్‌కు చెందిన 29వ సీడ్‌ అలెగ్జాండ్రా యాలా 7-6 (11-9), 6-2తో స్వైటెక్‌పై అద్భుత విజయాన్ని నమోదు చేసింది. పోటీ ఆరంభం నుంచే అలెగ్జాండ్రా స్వైటెక్‌కు గట్టి సవాల్‌ విసిరింది. తొలి సెట్‌ హోరాహోరీగా సాగి టైబ్రేకర్‌కు చేరగా, అక్కడ ఆమె శక్తివంతమైన సర్వీసులతో పైచేయి సాధించి సెట్‌ను కైవసం చేసుకుంది. రెండో సెట్‌లో కూడా ఆధిపత్యం కొనసాగించిన అలెగ్జాండ్రా కేవలం రెండు గేమ్‌లను మాత్రమే కోల్పోయి మ్యాచ్‌ను ముగించింది.

వివరాలు

టోర్నీ నుంచి నిష్క్రమించినవారు వీరే..

స్వైటెక్‌ చేసిన ఐదు డబుల్‌ ఫాల్ట్స్‌తో పాటు 44 అనవసర తప్పిదాలు ఆమె పరాజయానికి ప్రధాన కారణాలయ్యాయి. ఇదే రౌండ్‌లో రెండో సీడ్‌ ఎలెనా రిబకినా (కజకిస్థాన్‌) కూడా అనూహ్యంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. బెల్జియంకు చెందిన మెర్టిన్స్‌ 7-6 (7-4), 6-1తో రిబకినాపై విజయం సాధించింది. ఇతర మ్యాచ్‌ల్లో అమెరికా స్టార్‌ కొకో గాఫ్‌ 6-3, 6-7 (5-7), 6-2తో క్లైర్‌ లూ (అమెరికా)ను ఓడించి ప్రిక్వార్టర్స్‌కు చేరుకుంది. ఇటలీకి చెందిన పావోలిని 6-1, 6-2తో గ్రీస్‌కు చెందిన సకారిని ఓడించి ముందుకు సాగింది. మరోవైపు చెకియాకు చెందిన బౌజ్కోవా 4-6, 7-6 (7-3), 6-4తో రష్యాకు చెందిన సంసోనోవాపై విజయం సాధించి ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది.

వివరాలు

జ్వెరెవ్‌కు ప్రిక్వార్టర్స్‌ బెర్త్‌..

పురుషుల సింగిల్స్‌లో జర్మనీ స్టార్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ ప్రిక్వార్టర్స్‌కు చేరుకున్నాడు. మూడో రౌండ్‌లో రెండో సీడ్‌గా బరిలోకి దిగిన జ్వెరెవ్‌ 6-2, 7-6 (7-4), 6-4తో అమెరికాకు చెందిన గిరాన్‌ను ఓడించి తదుపరి దశలోకి ప్రవేశించాడు. ఇటలీకి చెందిన కొబాలి, రష్యా ఆటగాడు కచానోవ్‌పై 0-6, 7-6 (7-4), 6-7 (5-7), 6-2, 6-2తో ఐదు సెట్ల పోరులో విజయం సాధించాడు. ఐదో సీడ్‌ డిమెనార్‌ (ఆస్ట్రేలియా) 6-2, 5-7, 6-2, 6-4తో అమెరికా ఆటగాడు జకారిని ఓడించగా, చెకియాకు చెందిన లెహెకా 6-4, 6-4, 4-6, 6-4తో స్పెయిన్‌కు చెందిన మునార్‌పై గెలిచి ప్రిక్వార్టర్స్‌కు అర్హత సాధించాడు.

Advertisement

వివరాలు

డబుల్స్‌ నుంచి వైదొలిగిన సెరెనా..

గ్రాండ్‌స్లామ్‌ పునరాగమనంలో వింబుల్డన్‌ మహిళల సింగిల్స్‌లో తొలి రౌండ్‌లోనే నిష్క్రమించిన అమెరికా టెన్నిస్‌ దిగ్గజం సెరెనా విలియమ్స్‌ మహిళల డబుల్స్‌ పోటీల నుంచి కూడా తప్పుకుంది. 44 ఏళ్ల సెరెనా తన సోదరి వీనస్‌ విలియమ్స్‌తో కలిసి అర్జెంటీనాకు చెందిన సియెరా, కొలంబియాకు చెందిన ఒసారియో జోడీతో తొలి రౌండ్‌ మ్యాచ్‌ ఆడాల్సి ఉండగా, మోకాలి గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగింది.

Advertisement