చంద్రముఖి 2: ఆ విషయంలో దర్శకుడిని ఇబ్బంది పెట్టాను, రాఘవ లారెన్స్ మాటలు వైరల్
రజనీకాంత్ హీరోగా నటించిన చంద్రముఖి సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. తాజాగా చంద్రముఖి సినిమాకు సీక్వెల్ గా చంద్రముఖి 2 వస్తుంది. ఈ సినిమాలో రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్నారు. సెప్టెంబర్ 28వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది ఈ చిత్రం. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్లలో పాల్గొనడానికి రాఘవ లారెన్స్, కంగనా రనౌత్, దర్శకుడు పి వాసు, హీరోయిన్ మహిమా నంబియార్ హైదరాబాద్ కు విచ్చేశారు. ప్రమోషన్లలో రాఘవ లారెన్స్ మాట్లాడుతూ, రజనీకాంత్ చేసిన పాత్రలో తాను నటించడం తన అదృష్టమని, ఆ పాత్రకు న్యాయం చేయాలని చాలా భయపడుతూ నటించేవాడినని అన్నారు.
రాఘవ లారెన్స్ బాడీలో రజనీ స్టైల్
అలాగే కొన్ని సీన్లలో నటించేటప్పుడు రజనీకాంత్ స్టైల్ వచ్చేదని అలాంటప్పుడు దర్శకుడు హెచ్చరించే వారని అన్నారు. నడుస్తున్నప్పుడు, డైలాగ్ చెబుతున్నప్పుడు చాలాసార్లు రజనీకాంత్ స్టైల్ తన బాడీలో కనిపించేదని, ప్రతీసారి డైరెక్టర్ పి వాసు అలర్ట్ చేసేవారని, ఆ విషయంలో దర్శకుడిని కొంత ఇబ్బంది పెట్టానని రాఘవ లారెన్స్ మాట్లాడారు. అంతేకాదు తన బాడీలో కొంత రజనీకాంత్ స్టైల్, ఇంకొంచెం చిరంజీవి స్టైల్ ఉంటుందని.. చిన్నప్పటినుండి వాళ్ళ సినిమాలు చూస్తూ పెరగడం వల్ల అలా ఆ స్టైల్ వచ్చేసిందని రాఘవ లారెన్స్ తెలియజేశారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో రూపొందిన చంద్రముఖి 2 సినిమాలో వడివేలు, రాధికా శరత్ కుమార్ ఇతర పాత్రల్లో నటించారు. కీరవాణి సంగీతం అందించారు.