Ram Charan: తండ్రిని మించిన చరణ్.. రెండ్రోజుల్లోనే చిరంజీవి రికార్డు బద్దలు
ఈ వార్తాకథనం ఏంటి
మెగా కుటుంబం మళ్లీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాలు, పాటలు, అప్‌డేట్స్ అభిమానులను ఉత్సాహపరుస్తున్నాయి. అయితే ఈసారి తండ్రి-కొడుకుల మధ్య యూట్యూబ్ రికార్డుల పోటీనే చర్చనీయాంశమైంది. చిరంజీవి తాజా చిత్రం 'మనశంకర వరప్రసాద్ గారు' నుంచి విడుదలైన 'మీసాల పిల్ల' పాట సోషల్ మీడియాలో పెద్ద హిట్‌గా నిలిచింది. భీమ్స్ సిసిరోలియో స్వరపరిచిన ఈ ఎనర్జిటిక్ మెలోడీ విడుదలైన కొద్ది రోజుల్లోనే యూట్యూబ్‌లో 50 మిలియన్ వ్యూస్ దాటింది. చార్ట్‌బస్టర్‌గా నిలిచిన ఈ పాటపై అభిమానులు రూపొందించిన రీల్స్, షార్ట్ వీడియోలు సోషల్ మీడియా అంతా వైరల్ అయ్యాయి.
Details
రెండ్రోజుల్లోనే 50 మిలియన్ వ్యూస్
అయితే ఇప్పుడు ఆ రికార్డును చిరంజీవి కొడుకు రామ్ చరణ్ బద్దలు కొట్టడం విశేషంగా మారింది. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రూపొందుతున్న 'పెద్ది' చిత్రంలోని ఫస్ట్ సింగిల్ 'చికిరి చికిరి' రెండు రోజుల్లోనే 50 మిలియన్ వ్యూస్ దాటింది. ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన ఈ పాట కేవలం 35 గంటల్లోనే ఈ ఘనత సాధించడం విశేషం. తెలుగు సహా నాలుగు భాషల్లో విడుదలైన ఈ వీడియో సాంగ్ యూట్యూబ్ ట్రెండింగ్ లిస్టుల్లో టాప్ స్థానాన్ని సంపాదించింది. మరోవైపు చిరంజీవి పాట మాత్రం తెలుగులో మాత్రమే లిరికల్ వీడియో రూపంలో విడుదలై, మూడు వారాల్లో 50 మిలియన్ వ్యూస్ సాధించింది.
Details
సోషల్ మీడియాలో రికార్డులు సృష్టిస్తున్న రామ్ చరణ్, చిరంజీవి
తండ్రి-కొడుకులిద్దరూ వరుసగా సోషల్ మీడియాలో రికార్డులు సృష్టిస్తుండటంతో అభిమానులు మెగా మ్యూజిక్ ఫెస్టివల్ కొనసాగుతోందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇద్దరి పాటలూ భారీ హిట్స్‌గా నిలుస్తుండటంతో, సినీ వర్గాలు ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కూడా భారీ కలెక్షన్లు సాధిస్తాయని అంచనా వేస్తున్నాయి. మెగా ఫ్యామిలీ సంగీత జోష్‌తో టాలీవుడ్ ప్రస్తుతం కళకళలాడుతోంది.