Chennai Love Story: ఓటీటీలోకి 'చెన్నై లవ్‌స్టోరీ'.. ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
ఈ వార్తాకథనం ఏంటి
కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటించిన చిత్రం 'చెన్నై లవ్‌స్టోరీ' (Chennai Love Story). రవి నంబూరి దర్శకత్వం వహించిన ఈ ప్రేమకథా చిత్రం ఇటీవలే థియేటర్లలో విడుదలైంది. ముఖ్యంగా యువతను ఆకట్టుకున్న ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక సోనీలివ్ (SonyLIV)లో ఈ సినిమా ఆగస్టు 21 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగు ప్రేక్షకులతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ సినిమాను అందుబాటులోకి తీసుకురానున్నట్లు సోనీలివ్ అధికారికంగా ప్రకటించింది.
వివరాలు
ఇంతకీ కథ ఏమిటంటే..
నివి (శ్రీ గౌరీ ప్రియ) తనకు నచ్చిన అజయ్ (త్రిగుణ్)ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది.
ఇద్దరి వివాహానికి ముహూర్తం కూడా ఖరారవుతుంది. అయితే పెళ్లి సమయం దగ్గరపడిన వేళ ఊహించని పరిణామం చోటుచేసుకుంటుంది.
పెళ్లి పీటలపైకి రావాల్సిన అజయ్.. తాను మరో యువతిని ప్రేమిస్తున్నానని నివికి చెబుతాడు.
అంతేకాదు, ఆమెతో సంబంధాన్ని తెంచుకుంటున్నట్లు చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
అజయ్ ఇచ్చిన షాక్‌తో నివి తీవ్రంగా కుంగిపోతుంది. ఆ బాధ నుంచి ఆమెను బయటకు తీసుకురావాలనే ఉద్దేశంతో స్నేహితులు ఆమెను చెన్నైకి తీసుకెళ్తారు.
నివి మనసులో ఎలాంటి మార్పు కనిపించదు. ప్రేమలో ఎదురైన వైఫల్యాన్ని తట్టుకోలేక ఆమె క్రమంగా మద్యానికి బానిసగా మారుతుంది.
దేవదాసులా తన బాధను మరిచేందుకు మద్యం వైపు మొగ్గుచూపుతుంది.
వివరాలు
కథ సాగుతుందిలా..
ఇలాంటి పరిస్థితుల్లో నివి ఉంటున్న ఇంట్లోకి స్టీవెన్ శంకర్ (కిరణ్ అబ్బవరం) వస్తాడు.
అనాథ అయిన స్టీవెన్‌కు దర్శకుడు కావాలన్నది జీవిత లక్ష్యం. ఆ కలను నిజం చేసుకోవాలనే ఆశతో అతడు చెన్నైకి వస్తాడు.
అక్కడ నివి స్నేహితుల గ్యాంగ్ అతడికి ఉండేందుకు చోటు కల్పిస్తుంది.
తొలినాళ్లలో స్టీవెన్ చేసే పనులు, అతడి ప్రవర్తన నివికి చిరాకు తెప్పిస్తాయి.
అయితే రోజులు గడిచే కొద్దీ అతడి మాటలు, ఆలోచనలు, చేసే పనులు నివిపై ప్రభావం చూపడం మొదలవుతుంది.
ఆమె ఆలోచనా విధానంలోనూ క్రమంగా మార్పు వస్తుంది.
వివరాలు
ప్రేమ వైఫలం..
స్టీవెన్ పరిచయంతో నివి తన గతాన్ని, ఎదురైన ప్రేమ వైఫల్యాన్ని నెమ్మదిగా అధిగమిస్తుంది.
అతడితో సన్నిహితంగా మెలుగుతున్న కొద్దీ ఆమె మనసులో మరోసారి ప్రేమ చిగురిస్తుంది.
ఈసారి ఆ ప్రేమ స్టీవెన్‌పై కలుగుతుంది. మరి నివి, స్టీవెన్‌ల ప్రేమ ప్రయాణం ఎటు దారి తీసింది?
నివి గత ప్రేమను పూర్తిగా మరిచి కొత్త జీవితాన్ని ప్రారంభించగలిగిందా? దర్శకుడు కావాలన్న స్టీవెన్ కల నెరవేరిందా?
చివరికి వీరిద్దరి బంధం ఎలాంటి మలుపులు తిరిగింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.