Chinmayi: అలాంటి వ్యక్తినే పెళ్లి చేసుకోండి.. చిన్మయి చేసిన వ్యాఖ్యలు వైరల్
ఈ వార్తాకథనం ఏంటి
పూణెలో యువ పారిశ్రామికవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన అనంతరం సోషల్ మీడియాలో పురుషులు-మహిళల మధ్య జెండర్ ఆధారిత వాదోపవాదాలు మొదలయ్యాయి. పోలీసుల దర్యాప్తులో కేతన్‌ను అతని కాబోయే భార్య సియా గోయల్, ఆమెతో సన్నిహిత సంబంధం ఉన్న వ్యక్తితో కలిసి లోహగఢ్ కోటపై నుంచి తోసివేసి హత్య చేసినట్లు వెల్లడైంది. ఈ పరిణామం తర్వాత కొందరు మహిళల ప్రవర్తనపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ సాగించారు. ఈ నేపథ్యంలో నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్, ఆయన సతీమణి, ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
వివరాలు
నెటిజెన్‌కు దిమ్మతిరిగే సమాధానం..
ఇటీవల రష్మిక మందన్న ప్రధాన పాత్రలో రూపొందిన మహిళా ప్రాధాన్యత చిత్రం 'ది గర్ల్‌ఫ్రెండ్'కు దర్శకత్వం వహించిన రాహుల్ రవీంద్రన్‌ను ట్యాగ్ చేస్తూ ఓ నెటిజన్ ఎక్స్‌లో స్పందించాడు. కేతన్ అగర్వాల్ ఘటనను ప్రస్తావిస్తూ, మహిళలు పురుషులపై చేసే దారుణాల నేపథ్యంలో కూడా ఒక సినిమా రూపొందించాలని ఆయన కోరాడు. దీనిపై స్పందించిన రాహుల్ రవీంద్రన్, ఈ సంఘటనను మహిళలు పురుషులపై చేసే దాడిగా తాను చూడడం లేదని స్పష్టం చేశారు. మహిళల రూపంలో ఉన్న కొందరు మానసిక వికృతులు చేసిన తీవ్రమైన నేరంగా మాత్రమే దీనిని పరిగణిస్తున్నానని తెలిపారు.
వివరాలు
భర్త స్క్రీన్ షాట్‌ను షేర్ చేసిన చిన్మయి..
వ్యక్తిగతంగా జరిగే నేరాలను, సమాజంలో ఉన్న వ్యవస్థాగత సమస్యలతో పోల్చి చూడడం సరైన విధానం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. భర్త ఇచ్చిన ఈ సమాధానాన్ని స్క్రీన్‌షాట్ రూపంలో చిన్మయి తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. "ఇది తప్పకుండా చదవండి. పెళ్లి చేసుకోవాలంటే రాహుల్‌లాంటి ఆలోచనా విధానం ఉన్న వ్యక్తిని జీవిత భాగస్వామిగా ఎంచుకోండి. అలాంటి వ్యక్తి దొరకకపోతే పెళ్లి చేయకుండా ప్రశాంతంగా జీవించడం మంచిది. కానీ బాధతో జీవించాల్సిన అవసరం లేదు. ఇదే నా సలహా. మిగతా నిర్ణయం పూర్తిగా మీ ఇష్టం, మీ జీవితం" అంటూ ఆమె క్యాప్షన్ జత చేశారు.