LOADING...
Singer Chinamyi: మార్ఫింగ్ ఫోటోలతో వేధింపులు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన చిన్మయి
మార్ఫింగ్ ఫోటోలతో వేధింపులు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన చిన్మయి

Singer Chinamyi: మార్ఫింగ్ ఫోటోలతో వేధింపులు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన చిన్మయి

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 11, 2025
11:56 am

ఈ వార్తాకథనం ఏంటి

గాయని చిన్మయి శ్రీపాద మరోసారి సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న దాడులకు కఠినంగా ప్రతిస్పందించారు. మహిళల హక్కులు, భద్రత వంటి అంశాలపై ఘాటుగా స్పందించే ఆమె తరచూ ట్రోల్స్ లక్ష్యంగా మారడం తెలిసిందే. అయినప్పటికీ, ప్రతి సారి ధైర్యంగా ఎదురు నిలిచి వారి మాటలకు తగిన సమాధానమివ్వడం వల్ల చిన్మయి పలుమార్లు ప్రశంసలు అందుకున్నారు. తాజాగా మార్ఫింగ్ చేసిన ఫోటోలను ఉపయోగించి తనను అవమానించే ప్రయత్నం చేసిన వ్యక్తులపై చిన్మయి తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ ఒక వీడియోను పంచుకున్నారు. తమపై పోస్ట్ చేసిన మార్ఫింగ్ ఫోటోతో పాటు, ఆ పోస్టును చేసిన ఖాతా స్క్రీన్‌షాట్‌ను షేర్ చేస్తూ, వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

వివరాలు 

'ది గర్ల్ ఫ్రెండ్' మూవీ రిలీజ్ సమయంలో చిన్మయి,రాహుల్ రవీంద్రన్‌పై నెటిజన్లు తీవ్ర విమర్శలు, అసభ్య కామెంట్లు

గత 8-10 వారాలుగా కొందరు డబ్బులు తీసుకుని తనను, తన కుటుంబ సభ్యులను అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని కూడా వీడియోలో వెల్లడించారు. "ఈ రోజు నాకు మార్ఫ్ చేసిన ఒక ఫోటో పంపించారు. వెంటనే నేను పోలీసులను ట్యాగ్ చేశాను.వారు చర్యలు తీసుకుంటారో లేదో అది కీలకం కాదు. కానీ ఇలాంటి వారు అమ్మాయిలను, వారి కుటుంబాలను వేధించకుండా ఉండటం కోసం ఈ వీడియోను చేస్తోంది" అని చిన్మయి స్పష్టం చేశారు. 'ది గర్ల్ ఫ్రెండ్' మూవీ రిలీజ్ సమయంలో చిన్మయి, ఆమె భర్త రాహుల్ రవీంద్రన్‌పై నెటిజన్లు తీవ్ర విమర్శలు, అసభ్య కామెంట్లు చేశారు. రాహుల్ మంగళసూత్రం గురించి మాట్లాడిన పాత వీడియోను బయటకు తీసి, ఆయనపై దారుణమైన వ్యాఖ్యలు చేశారు.

వివరాలు 

మహిళల భద్రతపై స్పందించిన చిన్మయి.. పెరిగిన ట్రోలింగ్ 

మహిళల భద్రతపై చిన్మయి స్పందించడంతో ట్రోలింగ్ మరింత పెరిగింది. దీంతో బాధను భరించలేక ఆమె హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్‌కు ఎక్స్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఇప్పుడామె షేర్ చేసిన తాజా వీడియోలో కూడా కొంతమంది నెటిజన్ల పేర్లను ప్రస్తావిస్తూ, "పుట్టిన పిల్లలు చనిపోవాలని శపించే ఇలాంటి అబ్బాయిలకు ఎవరైనా అమ్మాయిలను ఇచ్చి పెళ్లి చేయాలా?" అని ప్రశ్నించారు. మార్ఫింగ్ ఫోటోలు వచ్చే సమయంలో భయపడకూడదని,వెంటనే కుటుంబ సభ్యులకు చెప్పి పోలీసులకు కంప్లయింట్ చేయాలని మహిళలకు సూచించారు. ప్రస్తుతం చిన్మయి పంచుకున్నఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆమె ధైర్యాన్ని చాలా మంది ప్రశంసిస్తున్నప్పటికీ,మరోవైపు ఆమెను ట్రోల్ చేయడానికి ప్రయత్నించే వారి సంఖ్య మాత్రం తగ్గడం లేదని కనిపిస్తోంది.

Advertisement