Ram Charan:హై ఫీవర్ ఉన్నా షూటింగ్ ఆపలేదు.. రామ్‌చరణ్ డెడికేషన్‌పై బుచ్చిబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న'పెద్ది' సినిమా నుంచి తాజాగా విడుదలైన 'రయ్ రయ్ రా రా' పాటకు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభిస్తోంది. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.పాటలోని లిరిక్స్, రామ్‌చరణ్ డ్యాన్స్ స్టెప్పులు, ఆయన చూపించిన ఎనర్జీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. అదేవిధంగా చెర్రీ కనిపించిన రగ్గడ్ లుక్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అయితే ఈ పాట షూటింగ్ సమయంలో రామ్‌చరణ్‌కు తీవ్రమైన జ్వరం వచ్చినట్టు తెలిసింది. దాంతో షూటింగ్‌ను ఆపేయాలనే ఆలోచన వచ్చినప్పటికీ,చరణ్ మాత్రం పూర్తి నిబద్ధతతో షూటింగ్ కొనసాగిద్దామని చెప్పారని దర్శకుడు బుచ్చిబాబు వెల్లడించారు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో చేసిన పోస్టుకు స్పందిస్తూ ఆయన తెలియజేశారు.
వివరాలు
చిరంజీవి ప్రత్యేక అభినందనలు
'రయ్ రయ్ రా రా' పాటపై మెగాస్టార్ చిరంజీవి కూడా స్పందించారు. ఈ పాట అద్భుతంగా వచ్చిందని చెబుతూ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. తన సోషల్ మీడియా ఖాతాలో చేసిన పోస్టులో,"రయ్ రయ్ రా రా పాటలో రామ్‌చరణ్ ఎనర్జీ,స్పీడ్ మరో స్థాయిలో ఉన్నాయి.అతని పెర్ఫార్మెన్స్, గ్రేస్ అద్భుతంగా ఉన్నాయి. అతడిని చూస్తే నాకు గర్వంగా అనిపిస్తుంది. దర్శకుడు బుచ్చిబాబు చేసిన పిక్చరైజేషన్, ఏఆర్ రెహమాన్ అందించిన మ్యాజికల్ మ్యూజిక్, జానీ మాస్టర్ కొరియోగ్రఫీ, రత్నవేలు అందించిన సినిమాటోగ్రఫీ, అనంత శ్రీరామ్ రాసిన లిరిక్స్ అన్నీ కలిసి పాటను పవర్‌ఫుల్‌గా నిలబెట్టాయి. 'పెద్ది' చిత్ర బృందానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు ఇలాంటి విజయాలు మరెన్నో సాధించాలి" అని చిరంజీవి పేర్కొన్నారు.
వివరాలు
జ్వరం ఉన్నప్పటికీ అంకితభావంతో పని
చిరంజీవి పోస్టుకు దర్శకుడు బుచ్చిబాబు స్పందిస్తూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. అదే సమయంలో ఈ పాట షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటనను కూడా గుర్తుచేశారు. "ఆ రోజు నాకు ఇప్పటికీ గుర్తుంది సర్. ఈ బీజీఎం భాగం షూట్ చేస్తున్నప్పుడు చరణ్ సర్ తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నారు. అందుకే మేమంతా షూటింగ్‌ను ఆపేయాలనుకున్నాం. కానీ ఆయన మాత్రం 'లేదు, షూటింగ్ కొనసాగిద్దాం' అన్నారు. అంత జ్వరం ఉన్నప్పటికీ ఆయన ముఖంపై చిరునవ్వుతో ఎంతో గ్రేస్‌తో డాన్స్ చేశారు. ఆ డెడికేషన్, ఆ యాటిట్యూడ్ అన్నీ మీ నుంచి వచ్చినవే సర్" అని బుచ్చిబాబు పేర్కొన్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న అభిమానులు రామ్‌చరణ్ అంకితభావానికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
దర్శకుడు బుచ్చిబాబు చేసిన ట్వీట్
Thank you sooo much Sirrrr
— BuchiBabuSana (@BuchiBabuSana) March 3, 2026
❤️❤️❤️🙏🙏🙏
ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది సర్, ఈ BGM షూటింగ్ చేస్తున్నప్పుడు Charan సర్కి High fever sir. మేము షూటింగ్ ఆపేద్దామన్నా, ఆయన “లేదు చేద్దాం” అన్నారు. అంత జ్వరం లో కూడా ముఖంపై చిరునవ్వుతో, ఎంతో గ్రేస్‌తో డాన్స్ చేశారు.
ఆ డెడికేషన్, ఆ… https://t.co/QXAlEOwlGw
వివరాలు
రెహమాన్ పాట- చెర్రీ ఆట
అనంత శ్రీరామ్ రచించిన ఈ పాటను సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్వయంగా ఆలపించారు. రెహమాన్ గాత్రం,బుచ్చిబాబు రూపొందించిన విజువల్స్,రామ్‌చరణ్ డ్యాన్స్ స్టెప్పులు ఈ పాటలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇవన్నీ కలసి పాటకు కొత్త వైబ్‌ను తీసుకొచ్చాయి.ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది చరణ్ డ్యాన్స్ గురించే. ఆయన వేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇప్పటికే 'చికిరి చికిరి'పాటలోని హుక్ స్టెప్‌తో ప్రేక్షకులను అలరించిన చరణ్,ఈపాటలో స్పీడ్‌తో కూడిన ఎనర్జిటిక్ డ్యాన్స్‌తో మరోసారి ఆకట్టుకున్నారు. సోమవారం సాయంత్రం విడుదలైన ఈ పాట 24 గంటలు పూర్తికాకముందే దాదాపు 20మిలియన్ల వ్యూస్ సాధించింది. ఇక గత ఏడాది విడుదలైన 'చికిరి చికిరి'పాట కూడా భారీ హిట్‌గా నిలిచింది.ఆ పాటకు నెటిజన్లు లక్షల సంఖ్యలో రీల్స్ రూపొందించారు.
వివరాలు
ఏప్రిల్ 30న 'పెద్ది' విడుదల
'పెద్ది' సినిమాకు బుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంతో యాక్షన్‌తో పాటు కుటుంబ భావోద్వేగాలను కలిపిన ఎంటర్టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. సీనియర్ నటుడు జగపతిబాబు, కన్నడ స్టార్ శివకుమార్, బొమన్ ఇరానీ, దివ్యేందు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 30న ఘనంగా విడుదల కానుంది.