Mega 158 : బాబి-చిరంజీవి కాంబో మళ్లీ రెడీ.. మెగా 158 పూజా కార్యక్రమం మార్చి 14న!
ఈ వార్తాకథనం ఏంటి
'మన శంకరవరప్రసాద్ గారు' సినిమా విజయానంతరం మెగాస్టార్ చిరంజీవి పెద్ద గ్యాప్ తీసుకోకుండా వెంటనే తన తదుపరి ప్రాజెక్ట్‌ను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. గత కొంతకాలంగా భిన్నమైన కథలను ఎంపిక చేస్తూ వస్తున్న ఆయన, ప్రేక్షకుల అభిరుచికి సరిపోయే కథలపైనే దృష్టి పెట్టుతున్నారు. ముఖ్యంగా అభిమానులను ఉత్సాహపరిచే మాస్ ఎలిమెంట్స్‌తో పాటు కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే భావోద్వేగ సన్నివేశాలు ఉండేలా కథలను ఎంపిక చేస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు బాబి కొల్లి దర్శకత్వంలో చేయబోయే కొత్త సినిమాపై తాజా వార్తలు వినిపిస్తున్నాయి.
వివరాలు
స్క్రిప్ట్‌కు ఫైనల్ టచ్
'మెగా 158' అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా రూపొందనున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కథ, స్క్రిప్ట్ పనులు తాజాగా పూర్తయ్యాయని తెలుస్తోంది. దర్శకుడు బాబి స్క్రిప్ట్‌ను ఫైనల్‌గా లాక్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రం పూర్తిస్థాయి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుందని సమాచారం. ఇందులో చిరంజీవిని ఇప్పటివరకు చూడని కొత్త తరహా పాత్రలో చూపించేందుకు బాబి ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. యాక్షన్, భావోద్వేగం,హాస్యం అన్ని కలిపిన పూర్తి వినోదభరితమైన ప్యాకేజీగా ఈ సినిమాను రూపొందించనున్నారని తెలుస్తోంది. పాతకాల కమర్షియల్ సినిమాల ఫీల్‌ను ఆధునిక సాంకేతికతతో మేళవించి బాబి ఈ కథను సిద్ధం చేసినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.
వివరాలు
మార్చి 14న పూజా కార్యక్రమాలు
చిరంజీవి ప్రత్యేక స్టైల్, పవర్‌ఫుల్ డైలాగ్స్, అభిమానులను ఆకట్టుకునే స్వాగ్ ఎంట్రీ సీన్, థియేటర్లలో ఈలలు పడే సన్నివేశాలు, బలమైన ఫైట్ సీక్వెన్సులు అన్ని ఈ చిత్రంలో ఉండేలా బాబి ప్లాన్ చేస్తున్నట్లు లోపలి సమాచారం. తాజా సమాచారం ప్రకారం, వచ్చే వారం మార్చి 14న హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రారంభించనున్నారని తెలుస్తోంది. దీంతో షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది? హీరోయిన్‌గా ఎవరు నటిస్తారు? సంగీత దర్శకుడు ఎవరు? అనే విషయాలపై అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. అయితే ఈ అంశాలపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. అయినప్పటికీ ఈ వార్తలు సోషల్ మీడియాలో అభిమానుల్లో మంచి ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి.
వివరాలు
బాబితో మరోసారి జోడీ
ఇప్పటికే ఫ్యాన్స్ ఫ్యాన్‌మేడ్ టీజర్లు, పోస్టర్లు రూపొందించి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ హంగామా చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే అభిమానులకు అది కేవలం ఒక చిత్రం మాత్రమే కాదు,నిజంగా ఒక పండుగలా ఉంటుంది. ఆయన తెరపై కనిపించే ప్రతి సన్నివేశాన్ని అభిమానులు సంబరంగా సెలబ్రేట్ చేస్తారు. ఇప్పుడు ఈ కొత్త సినిమాపైనా అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఇదివరకు చిరంజీవి-బాబి కొల్లి కాంబినేషన్‌లో వచ్చిన 'వాల్తేరు వీరయ్య' చిత్రం 2023లో విడుదలై భారీ విజయాన్ని సాధించింది. ఆ సినిమా సుమారు రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి మెగా అభిమానులకు పక్కా మాస్ యాక్షన్ ట్రీట్ ఇచ్చింది.
వివరాలు
కెరీర్‌లో అత్యధిక వసూళ్లు
ముఖ్యంగా ఇంటర్వెల్ సన్నివేశంలో చిరంజీవి చూపించిన విశ్వరూపం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు మెగా 158లో కూడా అలాంటి పవర్‌ఫుల్ ఎపిసోడ్లు ఉండాలని అభిమానులు ఆశిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా విడుదలైన 'మన శంకరవరప్రసాద్ గారు' సినిమా చిరంజీవి కెరీర్‌లో వసూళ్ల పరంగా అగ్రస్థానంలో నిలిచింది. జనవరి 12న విడుదలైన ఈ చిత్రం మంచి స్పందనను పొందడంతో పాటు చిరంజీవికి మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.350 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. దీంతో చిరంజీవి సుదీర్ఘ సినీ ప్రయాణంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా 'మన శంకరవరప్రసాద్ గారు' కొత్త రికార్డ్‌ను నెలకొల్పింది.