Allari Naresh: 'సుడిగాడు 2'పై క్రేజీ అప్‌డేట్.. ఒకే టికెట్‌తో 200 సినిమాలు చూపించబోతున్న అల్లరి నరేష్
ఈ వార్తాకథనం ఏంటి
అల్లరి నరేష్ ఈ నటుడి గురించి ఎంత మాట్లాడినా సరిపోదు. తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా అరుదుగానే కనిపించే ఒక ప్రత్యేకత ఆయనలో ఉంది. కామెడీ హీరోగా ఎంట్రీ ఇచ్చినా, అన్ని రకాల పాత్రలను అద్భుతంగా తీసుకెళ్లగల నటన శక్తి నరేష్‌లో స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవైపు హాస్య సినిమాలలో అలరించుతూనే, మరోవైపు భావోద్వేగాలు, సీరియస్ కంటెంట్ ఉన్న పాత్రల్లోనూ తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పర్చుకున్నాడు. అయితే ఇటీవలి కాలంలో అల్లరి నరేష్ సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాలు సాధించలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో నరేష్ తాజాగా కొత్త జానర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యాడు. ఆయన నటించిన '12A రైల్వే కాలనీ' నవంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Details
ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ కూడా జరుగుతోంది
సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న నరేష్, తన కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సుడిగాడు సీక్వెల్‌పై ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సుడిగాడు నాకు ఎంతో ప్రత్యేకమైన సినిమా. దీని సీక్వెల్ కోసం చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ కూడా జరుగుతోంది. సుడిగాడు టైంలో ఒకే టికెట్‌తో 100 సినిమాల ప్యారడీ చూపించాం. అద్భుతంగా వర్క్ అయ్యింది. కానీ ఇప్పుడు అదే చేస్తే ప్రేక్షకులు ఆమోదించరు. ఎందుకంటే సోషల్ మీడియాలో, రీల్స్‌లో ఇలాంటి కాన్సెప్ట్‌లను చాలా మంది చేస్తున్నారు.
Details
త్వరలోనే షూట్ ప్రారంభం
కాబట్టి సుడిగాడు 2లో 1 టికెట్‌పై 200 సినిమాలు అన్న రేంజ్‌లో ఉండాలి. ఆ దిశగా ప్లాన్ చేస్తున్నాం. త్వరలోనే షూట్ మొదలవుతుందని నరేష్ తెలిపారు. ఈ ప్రకటనతో అల్లరి నరేష్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు అందరి దృష్టి సుడిగాడు 2 ఎప్పుడు ప్రారంభమవుతుందో, ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందో అన్న విషయాలపై నిలిచింది.