గుండెను మాయం చేసే డేంజర్ పిల్లా: అర్మాన్ మాలిక్ గొంతులో అదిరిపోతున్న పాట
నితిన్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో ఎక్స్ ట్రా - ఆర్డినరీ మ్యాన్ అనే సినిమా తెరకెక్కుతోంది. శ్రీలీల హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ సినిమా నుండి తాజాగా డేంజర్ పిల్లా పాట రిలీజైంది. అర్మాన్ మాలిక్ గొంతులో పాట చాలా కొత్తగా వినిపిస్తోంది. వినగానే ఆకట్టుకునే ట్యూన్ తో, విన్న ప్రతీసారీ పెదాలపై తిరిగే పదాలతో ఆకర్షణీయంగా ఉంది. జేబుకు తెలియకుండా హార్టే మాయం కావడం, టచ్చే చేయకుండా నాలో మొత్తం నిండావు అనే వాక్యాలు ఆసక్తిగా ఉన్నాయి. ఈ పాటకు హారిస్ జయరాజ్ సంగీతం అందించగా, కృష్ణ కాంత్ సాహిత్యాన్ని సమకూర్చారు.
డేంజర్ పిల్లాకు శేఖర్ మాస్టర్ స్టెప్పులు
డేంజర్ పిల్లా లిరికల్ వీడియో చూస్తుంటే తెరమీద శ్రీలీల మరింత అందంగా కనిపించనుందని అర్థమవుతోంది. శేఖర్ మాస్టర్ తేలికైన స్టయిలిష్ స్టెప్పులు ఇన్స్ టాలో వైరల్ అయ్యేలా కనిపిస్తున్నాయి. అదలా ఉంచితే, నితిన్ గత చిత్రాలైన రంగ్ దే, మ్యాస్ట్రో, మాచర్ల నియోజకవర్గం సినిమాలకు ప్రేక్షకుల నుండి సరైన స్పందన రాలేదు. ఇప్పుడు తన ఆశలన్నీ ఎక్స్ ట్రా- ఆర్డినరీ మ్యాన్ సినిమా మీదే పెట్టుకున్నాడు. మరి ఎక్స్ ట్రా- ఆర్డినరీ మ్యాన్ నిజంగానే ఎక్స్ ట్రార్డినరీగా ఉండబోతుందా లేదా తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాలి. ఎక్స్ ట్రా- ఆర్డినరీ సినిమాలో రావు రమేష్, సంపత్, సుదేవ్ నాయర్, బ్రహ్మాజీ, హర్ష వర్ధన్ కీలక పాత్రలో కనిపిస్తున్నారు.